అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తిప్పేస్వామి
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ మోపురుగుండు తిప్పేస్వామితో స్పీకర్ కోడెల ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో స్పీకర్ కోడెల బుధవారం తిప్పేస్వామితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగిన ఈరన్న పదవి సుప్రీంకోర్టు తీర్పు మేరకు రద్దవడంతో తిప్పేస్వామికి అవకాశం లభించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చినట్లు రుజువవడంతో ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం, ఈరన్న తర్వాత స్థానంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు ఈరన్న ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దయింది. అయితే రద్దయిన సభ్యత్వానికి ఈరన్న రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈరన్న ఇచ్చిన రాజీనామా లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారోననే చర్చ జరిగింది. దీనిపై ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పును గౌరవిస్తూ తిప్పేస్వామితో ప్రమాణస్వీకారం చేయించాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం స్పీకర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ బుధవారం తిప్పేస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎట్టకేలకు న్యాయం జరిగింది..
అనంతరం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తన గెలుపే తొలి మెట్టు అవుతుందని పేర్కొన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు పాలనకు పతనం ప్రారంభమైందన్నారు. మూడేళ్లక్రితం రావాల్సిన తీర్పు ఆలస్యంగా వచ్చినా తనకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుద్వారా న్యాయం గెలిచినట్‌లైందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మార్గంలో నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామిని నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చినా స్పీకర్ స్పందించకుండా అధికారపార్టీ ఎమ్మెల్యేను కొనసాగించడంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వైఎస్సార్‌సీపీ విజయంగా భావిస్తున్నామన్నారు. విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల్ని చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ అసెంబ్లీ స్థాయిలో చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టుల దగ్గరకు వెళ్తే గానీ న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి నర్సెగౌడ్, బీసీ సెల్ రాష్ట్ర అ«ధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment