అభివృద్ధిపై కాదు..అవినీతిపైనే పోరాటం | thopudurthi prakash reddy fired on paritala sunitha | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై కాదు..అవినీతిపైనే పోరాటం

Published Sat, Jan 27 2018 8:23 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

thopudurthi prakash reddy fired on paritala sunitha - Sakshi

అనంతపురం: ‘మా పోరాటం అభివృద్ధిపై కాదు.. అవినీతిపైనే’ అంటూ’ వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు పనులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి పరిటాల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. అనంతపురంలోని తమ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేరూరు, బీటీపీ ప్రాజెక్టుల్లో వందల కోట్ల రూపాయాల ప్రజాధనం స్వాహా చేసేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేసిందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు వేదిక, సమయం వాళ్లు(పరిటాల సునీత) చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే’ అంటూ పేర్కొన్నారు. 59, 60 జీఓలు ప్రజాధనం దుర్వినియోగం కోసమేనన్నారు. పేరూరు డ్యాం గురించి పరిటాల రవి ఎన్నడూ అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు.

ఈ డ్యాంకు నీళ్లు  రాకుండా ఎగువ ప్రాంతం కర్నాటకలో నిర్మించిన ప్రాజెక్టుకు భూమిపూజ చేసి తన బినామీ కాంట్రాక్టర్‌తో పనులు చేయించిన చరిత్ర పరిటాల రవీంద్రదన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు రావాలనే డిమాండ్‌తో పేరూరు జలసాధన సమితి పేరుతో 2008 ఏప్రిల్‌ 28న  10 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ తాము ఏర్పాటు చేశామన్నారు. అంతకు రెండ్రోజుల ముందు బహిరంగ సభకు సంబంధించి ప్రచారకర్తలను పరిటాల రవి బామ్మర్ది బాలాజీ దాడి చేయించి రెండు జీపులను ధ్వంసం చేయించారని గుర్తు చేశారు. పరిటాల శ్రీరామ్‌ పేరూరుకు ఎగువ, దిగువన నాలుగేళ్లుగా ఇసుకను తోడుకుంటూ కర్ణాటకకు తరలించి రూ.వందలాది కోట్లు అర్జించారని ఆరోపించారు. దమిడీ ఖర్చు లేకుండా తురకాలపట్నం వద్ద మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి వంకలోకి నీళ్లు వదిలితే, దిగువనున్న పెన్నానదిలోకి వెళ్లి అక్కడి నుంచి పేరూరు డ్యాంకు వస్తాయని తాము ప్రతిపాదనలు చేస్తే పట్టించుకోలేదన్నారు.  

25 వేల ఎకరాలు ఎక్కడుందో..?
హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాం కింద 25 వేల ఎకరాలు సాగు చేయాలని చెబుతున్నారని, ఆయకట్టు ఎక్కడుందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పేరూరు డ్యాం కింద ఉన్న 10,047 ఎకరాలకు గాను హంద్రీ–నీవా కాలువకు దిగువనే 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పారుతోందన్నారు. రెండేళ్లుగా నీళ్లొస్తుంటే దిగువనున్న ఆయకట్టుకు నీళ్లివ్వకుండా పోలీసులతో అడ్డుకున్న మంత్రి కి పేరూరు డ్యాం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

ఆ పనులు ఎందుకు రద్దు చేయించారు
రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీ–నీవా దిగువన 76 వేల ఎకరాలు, పీఏబీఆర్‌ కుడికాలువ దిగువ 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటరీ పనులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఈ రోజు కేవలం 5 వేల ఎకరాల సాగుకే రూ.800 కోట్లు పెడుతున్నారు. ఈ 5 వేల ఎకరాలకు నీళ్లివ్వడానికి 36వ ప్యాకేజీ పేరూరు బ్రాంచి కాలువను స్వయంగా సీఎం చంద్రబాబు 2015 జూన్‌ 20న రద్దు చేయడానికి మౌఖిక ఆదేశాలు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో రూ.119 కోట్లతో ఈ పనులు పూర్తయ్యేవన్నారు.  

పేరూరు డ్యాంకు నీళ్ల ప్రతిపాదన మాదే
పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకెళ్లొచ్చనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది తామేనని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. 2007 జనవరి 16న ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని తాను, చెన్నంపల్లి నరసింహారెడ్డి క లిసి విన్నవించామన్నారు. దీనిపై స్పందించిన ఆయ న అధికారులతో డీపీఆర్‌ తయారు చేయించి 2009 లో రూ.119 కోట్లతో అంచనా వేయించారన్నారు.

చేసి చూపిస్తాం
రూ.374 కోట్లతో బీటీపీ, పేరూరుకు నీళ్లిచ్చేలా అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. టీడీపీ ప్రభుత్వం రూ.1,771 కోట్లతో పనులకు జీఓ ఇవ్వడం చూస్తే వెయ్యి కోట్లకు పైగా దోపిడీ కళ్లెదుటే కనిపిస్తోందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఓ విలేకరి 36వ ప్యాకేజీ మికిచ్చి, రూ.119 కోట్లు అదనంగా ఇస్తే పేరూరు డ్యాంకు నీళ్లివ్వగలరా? అని ప్రశ్నించారు. అందుకాయన సమాధానమిస్తూ కచ్చితంగా ఇస్తామని, ఫ్రీగా బీటీపీ కుడి కాలువ కూడా తవ్విస్తామన్నారు.

చిత్తశుద్ధి ఉంటే..
ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, పేరూరు ఆయకట్టు రైతుల మేలుకోరే వారైతే ఒక్క ఎకరా ఆయకట్టు లేని రిజర్వాయర్లను పక్కను పెడితే 1.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన పేరూరు డ్యాంకు మీరు సూచించిన అలైన్‌మెంట్‌ ద్వారా నీళ్లు తీసుకెళ్లినా రూ.200 కోట్లకు మించదని సలహా ఇచ్చారు. పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకున్నారనే మీ కుటుంబానికి ఉన్న మచ్చను తుడుపుకోవాలంటే వెంటనే తురలాపట్నం వద్ద నీళ్లిచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ నాగిరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement