సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నాయకులు తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వీరు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ వీరి భవిష్యతు కార్యచరణపై స్పష్టత రాలేదు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌తో తోట త్రిమూర్తులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశానికి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ నాయకుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.
మరోవైపు తోట త్రిమూర్తులుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులు గంటాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గంటా బీజేపీలోకి వెళ్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీపై టీడీపీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment