సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌సీపీ కంచుకోట అయిన జిల్లాలో గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారందరి స్థానంలో కొత్తవారిని బరిలోకి దించే ప్రయోగం చేయబోతున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రాజంపేటతో పాటు ఆ పార్టీ ఓటమి చెందిన మిగిలిన 9 స్థానాల్లో కూడా పాతవారిని పక్కన పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలో నలుగుతున్న అంతర్గత కలహాలు, కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసే వారు లేకపోవడం లాంటి అంశాలను ఇందుకు అనుకూలంగా మలుచుకోవడానికి నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో పాటు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం పలువురు నాయకుల అభ్యర్థిత్వాల గురించి జనాభిప్రాయం సేకరించే పనిలో పడ్డారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతల మధ్య రాబోయే ఎన్నికల కోసం అప్పుడే టిక్కెట్ల పోరు ప్రారంభమైంది.
మార్పుచేర్పులు ఇలా..
⇔ జమ్మలమడుగు నుంచి పోటీచేసిన పి. రామసుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా శాసనసభకు పోటీ చేయాలని కోరుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించి మంత్రి అయిన ఆదిని ఇక్కడి నుంచి పోటీ చేయించడానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు వర్గాలు కలసి పనిచేసేలా చేయడం కోసమే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆది విజయం కోసం పీఆర్ మద్దతుదారులు పనిచేసే ప్రసక్తే ఉండదని, ఇది విఫల ప్రయోగమే అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
⇔ బద్వేలులో టీడీపీ ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి మూడు దారులుగా ఉన్నారు. ఒకరితో ఇంకొకరికి ఏ మాత్రం పొసగడం లేదు. దీంతో ఇక్కడ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. ఈ కారణంతో రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని వెదుకులాట ప్రారంభించింది.
⇔ మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తప్పించి మాజీమంత్రి డీఎల్ రవీంద్రరెడ్డిని బరిలోకి దించడం దాదాపు ఖాయమైందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. డీఎల్‌కు బాబు టిక్కెట్ హామీ ఇచ్చారని, అందువల్లే పుట్టాను నామినేటెడ్ పదవితో శాంతపరచే ఆలోచన జరుగుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా తానే పోటీలో ఉంటానని పుట్టా చెబుతున్నప్పటికీ ఆయన ఆశ నెరవేరే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
⇔ కడపలో టీడీపీకి బలమైన అభ్యర్థే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రెబల్‌గా బరిలోకి దిగిన దుర్గాప్రసాద్‌ను పార్టీ సస్పెండ్ చేసినా పార్టీతో ఆయన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దూకాలని ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకుడు హరిప్రసాద్, మైనారిటీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని సుభాన్‌బాషా విన్నవించుకుంటున్నారు. వీరి వల్ల ఉపయోగం లేదని, కొత్త అభ్యర్థిని అన్వేషించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
⇔ రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డికి ఈ సారి టిక్కెట్ అనుమానమేనని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి బలిజ సామాజికవర్గాన్ని పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు నాయకులు చెబుతున్నారు. ఈ కోటాలో ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు నాయకులు టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.
⇔ రైల్వేకోడూరు నుంచి పోటీచేసి ఓడిన ఓబిలి సుబ్బరామయ్య ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాల్లో కనిపించకుండానే పోయారు. దీంతో ఈసారి ఎన్నికలకు కొత్త అభ్యర్థిని చూడాలని నాయకత్వం భావిస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్న విశ్వనాథనాయుడు, ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ బత్యాల తమ వర్గీయుడిని అభ్యర్థిగా చేసుకునే రాజకీయం చేస్తున్నారు.
⇔ కమలాపురంలో పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డిని పోటీకి దించితే గానీ అక్కడ గట్టి పోటీ ఇవ్వలేమనే అభిప్రాయంతోనే పార్టీ ఈ ఆలోచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే వీరశివారెడ్డి ఇటీవల మీడియా స మావేశం ఏర్పాటు చేసి తాను ప్రజల్లోనే ఉంటానని, టిక్కె ట్ ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించడం పుత్తా అవకాశాలను దెబ్బతీయడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
⇔ రాయచోటి నుంచి ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పాలకొండ్రాయుడు మద్దతు లేకుండా గెలవడం సాధ్యం కాదని టీడీపీ నాయకత్వం అంచనా వేసింది. రమేష్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తే పాలకొండ్రాయుడు సహకరించే పరిస్థితి లేనందువల్ల కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తోంది.
⇔ పులివెందుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి టిక్కెట్ విషయంలో ఈసారి పోటీ నెలకొంది. టిక్కెట్ తనకేనని ఆయన ధీమాగా చెబుతున్నప్పటికీ జిల్లా టీడీపీ వర్గ సమీకరణాలు, ఆధిపత్య పోరాటాల వల్ల ఇక్కడ కూడా అభ్యర్థి మారొచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్టీ నాయకుడు పేర్ల పార్థసారధిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
⇔ ప్రొద్దుటూరు నుంచి ఈసారి తాను పోటీకి దిగాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చాలాకాలం నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదని సీఎం రమేష్ వర్గం ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకునే పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డితో రమేష్ స్నేహం నడుపుతున్నారు. సొంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రమేష్‌కు టిక్కెట్ ఇవ్వడానికి సీఎం ఆమోదం తెలిపారని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment