
అదంపూర్: టిక్ టాక్ చాలా మందిని ఓవర్ నైట్ స్టార్లను చేసింది. నాలుగు గోడల మధ్య ఉన్న ప్రతిభ టిక్ టాక్ పుణ్యమా అని బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది(శృతి మించితే వినాశనానికి దారితీస్తోంది). టిక్ టాక్ వీడియోలతో చాలా మంది సెలబ్రెటీలుగా మారుతున్నారు. అయితే టిక్ టాక్ స్టార్ అయిన ఓ మహిళకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ వరించింది. హరియాణకు చెందిన సొనాలీ ఫోగట్‌కు టిక్ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ టిక్ టాక్ స్టార్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనుంది. అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీజేపీ సొనాలీకి కేటాయించింది. గురువారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్ పేరును చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.
అయితే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అదంపూర్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అదంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిషానికే కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి హరియాణ మాజీ సీఎం భజన్ లాల్ 2000 ,2005 ఎన్నికల్లో గెలుపొందారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో భజన్ లాల్‌కు చెందిన కుటుంబం సభ్యులే గెలుపొందారు. దీంతో బీజేపీ అందపూర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా టిక్ టాక్ స్టార్‌కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అదంపూర్ అసెంబ్లీ ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment