సాక్షి, బెంగళూర్ : కన్నడనాట మళ్లీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల రగడ మొదలైంది. ప్రతీయేడూ లాగే ఈసారి కూడా టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని హిందుత్వ సంఘాలు పిలుపునిస్తుండగా.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లేఖతో ఈసారి అది మరింత రసవత్తరంగా మారింది. టిప్పును హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ... నవంబర్ 10న నిర్వహించబోయే జయంతి వేడుకలకు తననను ఆహ్వానించొద్దంటూ హెగ్డే కర్ణాటక ప్రభుత్వానికి ఈ యేడాది కూడా లేఖ రాశారు.
దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త ఘాటుగా స్పందించారు. జయంతి వేడుకలను హేగ్డే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ శనివారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య మండిపడ్డారు. బ్రిటీష్ వారి వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడి విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేయటం సరికాదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగం అయి ఉండి ఆయన(హెగ్డే) ఇలాంటి పని చేయటం సరికాదు. ఆహ్వానాలు అందరికీ పంపుతాం. వాటిని తీసుకోవటం.. తీసుకోకపోవటం.. రావటం.. రాకపోవటం.. అనేది వాళ్ల ఇష్టం అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇక బీజేపీ ఎంపీ శోభా కరందల్జే హెగ్డేకు మద్ధతు తెలిపారు. టిప్పు సుల్తాన్ ఓ కన్నడ వ్యతిరేకని.. హిందూ వ్యతిరేకని ఆమె తెలిపారు. టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని కన్నడ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. గతేడాది కూడా అనంతకుమార్ ఇదే రీతిలో తనను మైసూర్ సుల్తాన్ టిప్పు జయంతి వేడుకలకు ఆహ్వానించొద్దంటూ లేఖ రాశారు కూడా.
విమర్శలు...
భారతదేశపు మొట్టమొదటి మిస్సైల్ మ్యాన్ గా టిప్పు సుల్తాన్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. కానీ, కొందరు విమర్శకులు మాత్రం ఆయన హిందువులను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొడగు, శ్రీరంగపట్నంలో ఈ నరమేధం ఎక్కువగా జరిగిందని చెబుతుంటారు. మోహన్‌దాస్ లాంటి విద్యావేత్తలు సదస్సులు నిర్వహించి మరీ విమర్శలు గుప్పిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉత్సవాల నిర్వహణలో వెనక్కి తగ్గటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment