
ప్రజల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆకునూరి మురళి
సాక్షి, హైదరాబాద్: ప్రజాకాంక్షలను రాజకీయ పార్టీ ల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తెలంగాణ జాయిం ట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) మెజారిటీ ప్రజల అవసరాలు, ప్రాధాన్యత రంగాలను విశ్లేషించి ప్రజల మేనిఫెస్టోను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
మేనిఫెస్టో రూపకల్పనలో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీతోపాటు జిల్లా కమిటీ సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, వివిధ సామాజిక సంస్థలు, ఉపాధి హామీ రేడియో, టీఎస్ ఆర్టీసీ పరిరక్షణ సమితి, విద్యా పరిరక్షణ కమిటీలు భాగస్వాములయ్యారు. దాదాపు 15 ప్రాధాన్యత రంగాల్లోని కీలకాంశాలపై టీజేఏసీ బృం దం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు విశ్లేషణ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు టీజేఏసీ చైర్మన్ కంచర్ల రఘు తెలిపారు.
ఈ మేనిఫె స్టోను టీజేఏసీ త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అందించనుంది. ఆయా పార్టీలు వాటిలోని అంశాలను మేనిఫెస్టోల్లో ప్రకటించేలా చర్యలు తీసుకోనుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ వీటి అమలులో తాత్సారం జరిగితే ఉద్యమిం చనున్నట్లు టీజేఏసీ ప్రకటించింది. మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగానే వచ్చే ఐదేళ్లలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
మేధావుల్లో తెలియని భయం కనిపిస్తోంది: ఆర్కైవ్స్ డీజీ మురళి
‘మేధావులు చురుకుగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. కానీ మన సమాజంలోని మేధావుల్లో ఎక్కడో తెలియని భయం కనిపిస్తోంది. దాం తో వారంతా సమస్యలపై గళమెత్తేందుకు ఆలోచిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీనివల్ల వ్యవస్థ సంకటంలో పడుతుంది’ అని రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డా రు. టీ జేఏసీ రూపొందించిన ప్రజల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మేధావులంటే ఉన్నత చదువులు చదివినోళ్లే కాదు.
కాస్త చదువుకొని సమాజంపై అవగాహన, విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. వారంతా బయటకు వస్తేనే సమాజంలో మార్పు మొదలవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాలు రూపొందిస్తున్న బడ్జెట్ ఆర్భాటంగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. బడ్జెట్‌పైన అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతారు. కానీ ఖర్చుపైన మాత్రం పెద్దగా చర్చించరు. ఖర్చు చేసిన నిధులపైనా సుదీర్ఘ చర్చ జరపాల్సిన అవసరం ఉంది’అని సూచించారు.
టీ జేఏసీ మేనిఫెస్టోలోని అంశాలు పేదల అభ్యున్నతికి తోడ్పడతాయని, వాటిని అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతానికిపైగా అమలు చేసే కార్యక్రమాలే టీజేఏసీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. పారదర్శకంగా, పద్ధతిగా నిధులు ఖర్చు చేస్తే వాటి ఆచరణ అసాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేలా మేధావులు ప్రయత్నించాలని, జీరో బేస్డ్ ఎలక్షన్స్ జరిగేలా ఉద్యమిం చాలని మురళి సూచించారు. సచివాలయంలో సెక్షన్ అధికారి నుంచి సీఎం వరకు ప్రతి దశలో జరిగే ఫైళ్ల పురోగతిని ప్రజలు తెలుసుకునే వెసులుబాటు కలి గిస్తే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు.
ప్రజల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
వ్యవసాయం: రాష్ట్ర బడ్జెట్‌లో 20% నిధులతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు. రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చేలా ఆదాయ కమిషన్ ఏర్పాటు. రైతులకు నెలకు రూ. 18 వేల ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు.
మహిళలు: వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మహిళలకు గుర్తింపు కార్డులు. వ్యవసాయ కూలీలు, సాగు చేస్తున్న ఒంటరి మహిళలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లోని మహిళల ఉపాధికి సహకారం.
భూ సంస్కరణలు: కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టంలో సాగుదారుల కాలమ్ పునరుద్ధరణ. భూమిలేని పేదలకు భూ పంపిణీ. శ్రీశైలం ప్రాజెక్టు సహా వివిధ సాగునీటి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట.
నీటిపారుదల: కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పునఃపరిశీలన. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అవసరమైన మార్పులతో పునరుద్ధరణ.
విద్యుత్: గృహ, వ్యాపార, చిన్న, కుటీర పరిశ్రమలకు విద్యుత్ చార్జీల తగ్గింపు. 100 యూనిట్ల వరకు ఉచితం, 200 యూనిట్ల వినియోగంపై సగం చార్జీ. రైతులు, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉండే ప్రైవేటు నర్సరీలకు ఉచిత విద్యుత్.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ: ఉపాధిహామీ పథకంలో నమోదు చేసుకున్న 51 లక్షల కుటుంబాలకు పక్కాగా 100 రోజుల పనిదినాలు. ఉపాధి కూలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు.
సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు. బీసీలకూ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు. దళితులపై దాడుల నివారణ, కుల నిర్మూలన చట్టం ఏర్పాటు.
ఆదివాసీలు: ఆదివాసీ ప్రజల ఉనికి, గుర్తింపునకు హామీ. అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం, పెసా చట్టాల పక్కా అమలు. పోడు భూములకు పట్టాల పంపిణీ.
విద్య: విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధుల కేటాయింపు. స్కూళ్లలో ఉదయం అల్పాహారం, సాయంత్రం ఉపాహారం. ప్రైవేటు వర్సిటీల బిల్లు రద్దు.
వైద్యం: ప్రతి మండలంలో పీహెచ్‌సీ, నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు. 24/7 పీహెచ్‌సీల పని వేళలు.
అసంఘటిత కార్మిక రంగం: బీడీ కార్మికులకు కనీస వేతనాలు. హమాలీ కూలీలకు సమగ్ర చట్టం. ఆటో, మోటారు వాహన రంగాల్లోని కార్మికుల సంక్షేమం, భద్రతకు చర్యలు.
పారిశ్రామిక రంగం: చిన్న, కుటీర, గృహ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. సింగరేణి పరిధిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ రద్దు.
మద్య నిషేధం: రాష్ట్రంలో మద్య నిషేధం అమలు. నీరా ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకం.
యువజనం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ పూర్తిస్థాయిలో భర్తీ. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్. కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం.
చట్టాల అమలు: రాజ్యాంగంతోపాటు ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాల పక్కా అమలు.
Comments
Please login to add a commentAdd a comment