
ఏం చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి హోదా, విభజన చట్టంలోని హామీల గురించి అడుగుతారా? లేక ఎప్పటిలానే స్వప్రయోజనాల కోసం ఫణంగా పెడతారా? కేంద్ర నిధులపై పదేపదే మాటమార్చుతున్న సీఎం భారీగా నిధులొస్తున్నాయని ప్రచారం చేసింది ఆయనే.. నాబార్డు నిధులపై కేంద్రానికి లేఖ.. మళ్లీ మభ్యపుచ్చే యత్నం హోదాపైనా, విభజనచట్టంలోని అంశాలపైనా ఏనాడూ పట్టుబట్టని బాబు.. కేంద్రంలో అధికారం అనుభవిస్తూనే అబద్దపు ప్రచారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారునెలల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుస్తున్నారు. అందుకోసం నేడు ఆయన హస్తినకు పయనమౌతున్నారు. రాష్ట్రభవిష్యత్తుకు సం బంధించిన అంశాలపైనా, విభజనచట్టంలోని హామీల అమలుపైన చర్చిస్తారా అన్న ఆసక్తి రాష్ట్రప్రజలలో నెలకొంది. కేంద్రంలో భాగస్వామి కనుక ఈ ఏడాది అయినా రాష్ట్రప్రయోజనాల కోసం ఏమన్నా సాధిస్తారా అని రాష్ట్రమంతా చూస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిందిగా ఇప్పటికైనా ఆయన ప్రధానమంత్రిని కోరాలని కోట్లాదిమంది నిరుద్యోగులు ఆశిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేయాల్సిందిగా ఇకనైనా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అయినా కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి పదహారు నెలలుగా ఢిల్లీకి వెళ్లకపోవడమేమిటి? కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడమేమిటి? ఏమీ సాధించలేకపోవడమేమిటని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమేమిటి?
విభజనచట్టంలోని హామీల అమలు కోసం గానీ, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ప్రధానమైన సమస్యలపై గానీ కేంద్రాన్ని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయని ముఖ్యమంత్రి పదహారునెలల తర్వాత ప్రధానమంత్రిని కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు, ఇంకా ఇతర అవినీతి కేసుల భయంతోనే ఆయన హస్తినకు దూరంగా ఉండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రప్రభుత్వంపైనా, పరిపాలనా తీరుపైనా రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతుండడం, వందల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు పూనుకున్నారని వినిపిస్తోంది. నియోజకవర్గాలను పెంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్ల భద్రత కలిగించకపోతే అటు ఆ ఎమ్మెల్యేల నుంచి ఇటు సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చే వత్తిళ్లు తట్టుకోవడం కష్టమని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతున్నట్లు వార్తలు వస్తుండడంతో దానిని బలహీనపరచేందుకు నియోజకవర్గాల పునర్విభజన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో కలసి పోటీ చేసిన పార్టీతో ఉమ్మడిగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ, రాష్ట్రప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 16 నెలల పాటు ప్రధానమంత్రిని కలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. దీనిని బట్టే ముఖ్యమంత్రి రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని విమర్శకులంటున్నారు.
మొదటి నుంచీ మభ్యపుచ్చే యత్నాలు..
విభజనచట్టం హామీల నుంచి కేంద్ర నిధుల వరకు ఏ అంశంపైనైనా ప్రజలను మభ్యపుచ్చడమే అడుగడుగునా కనిపిస్తుంది. ఆరోజు స్వయంగా అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అరుణ్‌జైట్లీ ప్రకటనను ముఖ్యమంత్రి స్వాగతించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దానికి సమానమైన నిధులు ఇస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఇస్తానంటే వద్దంటామా? కోడలు మగపిల్లాడ్ని కంటానంటే ఏ అత్త అయినా వద్దంటుందా?అని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వ్యంగ్య వ్యాఖ్యానాలూ చేశారు. భారీ స్థాయిలో నిధులు రాబోతున్నాయని, ఈఏపీ ప్రాజెక్టుల కిందే రూ.20వేల కోట్లు రాబోతున్నాయని చంద్రబాబు ప్రచారం చేశారు. ఇపుడు మాటమార్చి అకస్మాత్తుగా ఈఏపీ ప్రాజెక్టుల కింద రూ.16,447 కోట్లు నాబార్డు ద్వారా గ్రాంటుగానైనా ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇదీ మరో మభ్యపుచ్చే ప్రయత్నమే తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదని ఆయనకూ తెలుసు. హోదా కోసం రాష్ట్రప్రజలు ఉద్యమిస్తున్న సమయంలో దానికోసం తానూ గొంతు కలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం మానేసి ఎక్కువ డబ్బులు రాబోతున్నాయని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ నిధులివ్వడం లేదంటూ నెపం కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్యాకేజీ అనేదే లేదని, జైట్లీ ప్రకటనలోని వన్నీ విభజన చట్టంలోని హామీలేనని అర్ధం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కరేలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని వారు పేర్కొంటున్నారు. ఘనమైన ప్యాకేజీ ఇచ్చారంటూ అసెంబ్లీలో తీర్మానాలు, వెలుపల భారీ సన్మాన సభలు నిర్వహించడం, అదేదో ప్యాకేజీ వచ్చేసిందంటూ చంద్రబాబు అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తెలిసిన విషయాలే.
కేంద్రంలో కొనసాగుతూనే...
కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ.. మంత్రులను కొనసాగిస్తూ.. అధికారాన్ని పంచుకుంటూ.. రాష్ట్రప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రంపై ఏనాడూ వత్తిడి చేసిన పాపాన పోలేదు. అసలు ప్యాకేజీ అనేదే లేదన్న విషయం చంద్రబాబుకు తెలుసు. కేంద్రానికీ తెలుసు. అందుకే కేంద్రం నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా అందులో ప్రత్యేక ప్యాకేజీ అన్న పదమే కనిపించదు. విభజన చట్టంలోని అంశాలేవీ ప్రత్యేకంగా ఇస్తున్నవి కాదు. మనకు చట్టబద్దంగా దక్కాల్సినవే. ప్రత్యేకంగా ప్యాకేజీ అనేదేమీ లేకపోయినా ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఆ పదాన్ని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఉపయోగిస్తూ వచ్చారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి భారీగా మేలు జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదాను వదిలేసి ప్యాకేజీకి ఓకే చెప్పామని చంద్రబాబు అదేపనిగా ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా కేంద్రానికి లేఖలు రాస్తూ.. కేంద్రం ఇవ్వట్లేదు అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తూ.. ప్రజలను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment