
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ఆ చేతి స్పర్శ ఓ భరోసా.. ఆ మాటలో అసాధారణ ఆత్మ గౌరవం.. ఆ అడుగు రేపటి బంగారు భవితకు సోపానం.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జనం గుండె చప్పుళ్లకు ప్రతీకగా నిలిచింది. సోమవారం.. ప్రజా సంకల్పయాత్ర 1000 కిలోమీటర్ల అరుదైన మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పాదయాత్ర విజయవంతంగా సాగుతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అభిమాన నేత నిర్దేశించిన దూరాన్ని చేరుకునేందుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రజలు దేవుడిని కోరుకుంటున్నారు. పాదయాత్రలో 74వ రోజున నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం సమీపంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెయ్యి కిలోమీటర్లను దాటుతారు.
జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర...
కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర నవంబర్ 14వ తేదీ ప్రారంభమై డిసెంబర్ 3వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలోని చాగలమర్రి నుంచి ప్రారంభమైన పాదయాత్ర తుగ్గలి మండలం ఎర్రగుడి వరకు 18 రోజులపాటు కొనసాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాల మీదుగా దాదాపు 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అడుగడుగునా వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడిచారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వికలాంగులు పెద్ద ఎత్తున జననేతకు తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రజా సమస్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సావధానంగా వింటూ వాటికి పరిష్కారం చూపుతూ మందుకు సాగారు. జిల్లాలో చాగలమర్రి సమీపంలో 100 కిలోమీటర్లు, కారుమంచి సమీపంలో 200 కిలోమీటర్ల మైలురాయిని ప్రతిపక్ష నేత అధిగమించారు. తన పాదయాత్రలో..అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా ఉంటానని, ఏడాదిపాటు ఓపిక పడితే ప్రజా ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పారు.
గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు: మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 18 రోజులపాటు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో పాదయాత్ర చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టును చేపడుతానని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి నానుతూ వస్తున్న హగరి, నగరడోణ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను ఒక టైమ్ బౌండ్‌తో పూర్తి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పారు. వీటితో జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. నవరత్నాలు అమలైతే రాష్ట్రంలో పేదరికం మాయవుతుంది.
శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
సమస్యలు చెప్పుకొని ఉపశమనం పొందారు: నాలుగేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు అడిగిన వారు ఒక్కడూ లేడు. ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితం అయ్యారు. ప్రజలు తమ సమస్యలను జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో చెప్పుకొని ఉపశమనం పొందారు. ఆయనే సీఎం అన్న రీతిలో ఊహించుకొని తమ సమస్యలను బాధప్త హృదయంతో చెప్పుకున్నారు. ఆయన కూడా అంతే ఓపికతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రుణమాఫీ కాలేదని రైతులు, మహిళలు, ఫీజు రీయిబర్స్‌మెంట్ రాలేదని విద్యార్థులు, ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు, భృతి ఇవ్వడంలేదని యువకులు, పెన్షన్లు రావడంలేదని వృద్ధులు, మహిళలు, వితంతువులు, సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు, కులాల సమస్యల పరిష్కారం ఆయా సంఘాల నాయకులు వైఎస్ జగన్‌ను కలిశారు. రైతు, బీసీ, మహిళా సదస్సులు జిల్లాలో భారీ ఎత్తున విజయవంతం అయ్యాయి.
బీవై రామయ్య, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
నేడు వాక్ విత్ జగనన్న...
జిల్లాలోని రెండు పార్లమెంటరీ జిల్లాల పరిధిలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1000 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండడంతో ఈ కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ప్రతి మండలంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment