
ప్రజాసంకల్ప యాత్ర దూసుకెళ్తోంది. లక్ష లాదిమంది ప్రజలతో మమేకమవుతూ లక్ష్యం వైపు కదులుతోంది. దుష్ట పాలనను అంత మొందించి రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు వేస్తున్న అడుగులు అధికార పక్షం నేతల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు బాటలే సేందుకు బహుదూరపు బాటసారి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారంతో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుంది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘జగన్‌తో నడుద్దాం’ అంటూ వేలాదిమంది కదం తొక్కనున్నారు.
సాక్షి, విశాఖపట్నం: గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటూ మొక్కవోని దీక్షతో జనహృదయ నేత కదులుతుంటే పార్టీలకతీతంగా లక్షలాదిమంది ఆయనను అనుసరిస్తున్నారు. 3 వేల కిలోమీటర్ల ఈ సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల తొలి మైలురాయిని నేడు నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్ద వైఎస్ జగన్ దాటబోతున్నారు. ఈ సందర్భంగా జననేతకు బాసటగా పార్టీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘వాక్ విత్ జగన్’ అంటూ జగన్ సైన్యం పాదయాత్రలతో ఉరకలెత్తనుంది. ఉత్తుంగ తరంగంలా సాగనున్న ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులే కాదు.. సామాన్య జనం కూడా ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు అన్ని వార్డులు, మండల కేంద్రాల్లో కూడా ఈ పాదయాత్రలు జరిగేలా పార్టీ యంత్రాంగం రూట్ మ్యాప్ తయారు చేసింది.
సిటీ, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నేతలంతా ఈ పాదయాత్రల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో సైతం 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు పాదయాత్రలు చేసేలా షెడ్యూల్ తయారు చేశారు. విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కంచరపాలెం నుంచి ఐటీఐ జంక్షన్ వరకు జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. అలాగే అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్, పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణి అనకాపల్లిలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కాశీపురం నుంచి దేవరాపల్లి వరకు జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. చోడవరం, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో పాదయాత్రలు తలపెట్టగా మిగిలిన నియోజక వర్గాల పరిధిలో నాలుగు మండలాల శ్రేణులు ఒకేచోట జరిగే పాదయాత్రలో పాల్గొనేలా రూట్ మ్యాప్ తయారు చేశారు.
విజయవంతం చేయండి
సాక్షి, విశాఖపట్నం : ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర నేటితో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటుతున్న సందర్భంగా తలపెట్టిన వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. సోమవారం జీవీఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతాయన్నారు. వేలాదిగా పార్టీనేతలు, శ్రేణులు ఈ పాదయాత్రల్లో కదం తొక్కాలని మళ్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment