
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసాగా నిలిచే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. దీనిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘వాక్ విత్ జగన్’ పేరిట పాదయాత్ర చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. అదే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ‘వాక్ విత్ జగన్’ నిర్వహించాలని తలపెట్టారు.
ఈ సందర్భంగా ప్రజలకు భరోసాగా నిలవడంతోపాటు, పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరలో జిల్లాకు రానున్న పాదయాత్రలో అన్ని వర్గాలూ జగన్‌కు బాసటగా నిలిచేలా ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు మోషేన్‌రాజు, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. వాక్ విత్ జగన్‌లో పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు మోషేన్‌రాజు, కన్నబాబు, బోస్ పిలుపునిచ్చారు.