సాక్షి, కడప : ఇడుపులపాయలో 2011మార్చి 12వ తేదీన దివంగత వైఎస్‌ఆర్ సాక్షిగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 8 వసంతంలోకి అడుగిడుతోంది. అతి తక్కువ కాలంలో పార్టీకి పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2010లో సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. 2011లోజరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ, కడప ఎంపీగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. 2011లోఉప ఎన్నికలకు ముందు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీసీ అభ్యర్థి అఖండ విజయం సాధించారు.
అధికారపార్టీ అణిచివేతకు కృషి చేసినా..
2010లో వైఎస్ జగన్ బయటికి వచ్చిన నాటినుంచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు ప్రారంభించాయి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపాయి. అక్రమ కేసులు మెదలుకొని..కార్యకర్తలను బెదిరించే స్థాయి వరకు ఎన్ని రకాలుగా హింసకు గురి చేసినా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అండగా నిలబడ్డారు. 2011నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌తోపాటు కార్యకర్తలను అణిచివేసే ప్రత్యేక కుట్రకు తెరతీశారు.
చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపి
2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చరిత్ర సృష్టించింది. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని రికార్డు నెలకొల్పింది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల మనసులను గెలుస్తూనే ఉంది.
అనునిత్యం ప్రజల కోసం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనునిత్యం ప్రజల తరఫున ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇక ప్రత్యేక హోదా కోసం ఆదినుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క వైఎస్ జగనే అన్న విషయం అందరికీ తెలుసు. 2017 నవంబరు ఆరో తేదీ నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ.. అధైర్య పడవద్దు నేనున్నానంటు భరోసా నింపుతున్నారు.
నేడు పార్టీ ఆవిర్భావ వేడుకలు
పార్టీ ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల సోమవారం ప్రత్యేక కార్యక్రమాలుచేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment