నల్లగొండకు కాబోయే ఎంపీని నేనే.. | TPCC Chief Uttam Kumar Reddy Canvass In Kodada | Sakshi
Sakshi News home page

నల్లగొండకు కాబోయే ఎంపీని నేనే..

Published Tue, Mar 26 2019 11:19 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

TPCC Chief Uttam Kumar Reddy Canvass In Kodada - Sakshi

మునగాల : సభలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభకు హాజరైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు

సాక్షి,మునగాల (కోదాడ) : త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా తాను అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సన్నాహక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌గాంధీ ప్ర«ధాన మంత్రి, తాను ఎంపీ కావడాన్ని ఏశక్తీ ఆపలేదన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు తాను నల్లగొండ ఎంపీగా బరిలోకి దిగానని స్పష్టం చేశారు. నా జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు.

ఈ ఎన్నికలు భారత దేశ భవిష్యత్‌కు సంబంధించి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ ఓటర్లంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్న చూపని.. ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఓ భూకబ్జాదారుణ్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దించి నల్లగొండ ప్రజలను అవమానపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ 16ఎంపీ సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతానని మరో డ్రామాకు తెరలేపడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఉన్న ఎంపీలతో ఏం ఒరగబెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఇకపై ఎక్కువ సమయం నల్లగొండ పార్లమెంట్‌పై దృష్టిసారిస్తానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా ఈ పదిహేను రోజుల పాటు పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేసే అవకాశమున్నందున కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

నిజాయితీగా, నిస్వార్థగా పనిచేసే తనను కేంద్రానికి పంపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తాను కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మునగాల మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తిరిగి ఎంపీగా గెలిచి అంతకు పదిరెట్లు ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఓ నాయకుడు తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని.. ఆయనకు ప్రజలు తగిన విధంగా బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తొలుత ఉత్తమ్‌కు మునగాలలో ఘనస్వాగతం పలికారు. ర్యాలీగా సభాస్థలికి బయలుదేరిన ఉత్తమ్‌కు మునగాల ఓటర్లు నీరాజనం పలికారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మాతంగి బసవయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, వంగవేటి రామారావు, పందిరి నాగిరెడ్డి, నరంశెట్టి నర్సయ్య, కాసర్ల కోటేశ్వరరావు, వెంకట్రాంరెడ్డి, సాముల శివారెడ్డితోపాటు వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement