స్థానిక సమరానికి సిద్ధమైన కాంగ్రెస్‌ | TPCC Chief Uttam Meet with Senior Leaders | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సిద్ధమైన కాంగ్రెస్‌

Apr 22 2019 5:12 AM | Updated on Apr 22 2019 5:12 AM

TPCC Chief Uttam Meet with Senior Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. ‘స్థానిక’ సమరానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన పార్టీ.. ఇప్పుడు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న ట్లుగా స్థానిక టికెట్లు కూడా గాంధీభవన్‌ నుంచే ఖరారు చేసే ఆనవాయితీని పక్కనపెట్టి సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ పద్ధతిలో టికెట్‌ ఖరారు బాధ్యతలను క్షేత్రస్థాయి నాయకత్వానికే కట్టబెట్టింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షు లు, కో–ఆర్డినేటర్లతో ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌సమావేశం నిర్వహించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు జానారెడ్డి, షబ్బీర్, దామోదర రాజనర్సింహ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షులు కుమార్‌రావు, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు 32 జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఎన్నికలకు సంబంధించిన ఏ–ఫారాలు అందజేశారు. దీంతో డీసీసీ అధ్యక్షులే మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో నిర్ణయించిన అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చే బాధ్యతలను కట్టబెట్టారు. సోమవారం నుంచి జరిగే నామినేషన్లను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు జెడ్పీటీసీ అభ్యర్థులకు, మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

అఫిడవిట్‌ రెడీ 
పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌లు తీసుకున్న తర్వాతే బీ–ఫారాలు ఇప్పటికే కాంగ్రెస్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఆ అఫిడవిట్‌లను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు వేర్వేరుగా తయారు చేసిన హామీ పత్రాలకు సమావేశం ఆమోదం తెలిపింది. అభ్యర్థులంతా 20 రూపాయల బాండ్‌ పేపర్‌పై ఈ నమూనా అఫిడవిట్లలో పేర్కొన్న విధంగా హామీ పత్రం ఇవ్వనున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని, గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లబోమని ఈ అఫిడవిట్‌ ద్వారా అటు పార్టీకి, ఇటు ఆ ప్రాదేశిక నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థులు హామీ ఇవ్వనున్నారు.

పార్టీ ఆదేశాలను పాటిస్తానని, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీపీ లేదా జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో ఓటు వేయబోనని, అలా చేసినట్టయితే తన నియోజకవర్గ పరిధిలోని ఎవరయినా తనపై సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చని అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఈ అఫిడవిట్‌ న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుందని, భవిష్యత్తులో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి పార్టీ మారినా, పార్టీ ఆదేశాలను పాటించకపోయినా న్యాయచర్యలకు దిగే విధంగా న్యాయ నిపుణులతో చర్చించిన మేరకు అఫిడవిట్‌లు తయారు చేశామని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement