పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి(ఎడమ నుంచి కుడి వరుసగా)
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..రైతు బంధు పథకంపై దేశ వ్యాప్తంగా ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల ప్రచారంతో తెలంగాణ రైతుల సొమ్మును దుబారా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘ నాలుగేళ్లలో 4 వేల మంది ఆత్మహత్య చేసుకున్నా రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు లేవు. మద్దతు ధరకు బోనస్ ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం. వడగళ్ల వాన, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోలేక పోయిన ప్రభుత్వం . రైతులను టీఆరెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని విమర్శించారు.
‘ కేంద్రం ఇచ్చిన పంట నష్ట పరిహారం నిధులు వేరే వాటికి మళ్లించారు . మిర్చి రైతులకు బేడీలు వేశారు . ఎకరాకు 4వేలతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి. 25 శాతం అదనంగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపడం కాదు. రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇవ్వాలి. రూ.4 వేల ఇన్ పుట్ సబ్సిడీ మొదటి మూడేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల కోసమే ఈ ఏడాది ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారు . పంట బీమా పథకం మూలన పడేశారు. తెలంగాణ రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు . కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర అందిస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 70 శాతం కౌలు రైతులేనని తెలిపారు. కౌలు రైతులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. రైతు బంధు పథకం అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాదా బైనమా, ఆలయ భూములకు, అటవీ భూములకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని కోరారు.
కాంగ్రెస్ కిసాన్‌దళ్ అధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ..భూదాన్ భూములు, సీలింగ్ భూముల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కల్తీ విత్తనాలను ప్రభుత్వం అదుపు చేయలేక పోతుందని, కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో తన కుటుంబానికి సంబంధించిన భూములకు రైతు బంధు పథకం కింద సొమ్మును తీసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం నుంచి 140 టీఎంసీల నీళ్లు మూడు పంటలకు ఎలా ఇస్తారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment