
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొత్తుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం, నాన్చివేత ధోరణిపై కోదండరాం నేరుగా రాహుల్‌కే ఫిర్యాదు చేయడంపై ఏఐసీసీ పెద్దలు టీపీసీసీపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అయితే టికెట్ల ఆశావహులు పదేపదే ఢిల్లీ వెళ్లడం, అక్కడి ఏఐసీసీలోని పెద్దలను కలవడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులెవరూ ఢిల్లీ వెళ్లొద్దని, అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసి సమయం వృథా చేయవద్దని టీపీసీసీ నేతలు ఆశావహులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా కోర్‌కమిటీకి చేరిన తర్వాత కూడా ఆశావహులు ఢిల్లీలోనే ఉంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
పదేపదే కోర్ కమిటీ సభ్యులను కలవడం, వినతులివ్వడం చేస్తుండటంతో కోర్ కమిటీ సభ్యులు టీపీసీసీ పెద్దలను మందలించినట్టుగా తెలుస్తోంది. ఈనెల 9న అభ్యర్థుల జాబితా విడుదలవుతుండటంతో చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది అభ్యర్థులు మూడు రోజుల కిందటే ఢిల్లీవెళ్లి అక్కడే మకాం వేశారు. దీంతో అభ్యర్థులెవరూ ఢిల్లీ రావద్దని, అనవసరంగా సమయం వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. కొంతమంది అభ్యర్థులు ఏకంగా కులసంఘాల పెద్దలను, సామాజిక వర్గ నేతలను తీసుకెళ్లి యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఇతర పార్టీల పెద్దలతో ఏఐసీసీ నేతలకు ఫోన్లు కొట్టించడం హైకమాండ్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసిందని హస్తినలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థుల వినతులను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుపై టీపీసీసీ నేతలకు ఏఐసీసీ నేతలు ఘాటుగానే హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment