సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
సాక్షి, ఒంగోలు : రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడుతుందని, రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉందని విమర్శించారు. మార్టూరు మండలం బొబ్బెపల్లిలో మైనార్టీలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న 15 ఎకరాలను అధికార పార్టీ నాయకులు ఆక్రమించి అమ్ముకున్నారని ఆరోపించారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. దళితుల భూముల్లో వేసిన కట్టలు నెలాఖరు లోగా తొలగించాలని డిమాండ్ చేశారు. నెలాఖరున వివిధ సంఘాల నాయకులతో కలిసి దళితుల హక్కుల కోసం ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహించటం దేశానికి ప్రమాదకరమన్నారు. మైనార్టీల పట్ల వివక్ష, దళితుల ఊచకోతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment