న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 186 మంది సభ్యులు మద్దతు తెలపగా, 74 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనంతరం రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. మహిళలకు న్యాయం చేకూర్చడానికి సంబంధించినది. ఈ బిల్లును సమానత్వం, న్యాయం కోసం తీసుకొస్తున్నాం. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి 543 కేసులు నమోదయ్యాయి. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా 200 కేసులు నమోదయ్యాయి. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇందుకోసం మేం కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
అందరికీ ఒకే శిక్ష ఉండాలి: కాంగ్రెస్
ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు కేవలం ఓ మతాన్ని.. ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. భార్యలను కేవలం ముస్లిం పురుషులే వదిలివేస్తున్నారా? ఈ బిల్లు సివిల్, క్రిమినల్ చట్టాలకు విరుద్ధంగా ఉంది. మేం ట్రిపుల్ తలాక్‌ను సమర్థించడం లేదు. కానీ ఈ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దేశంలో ఎవరు భార్యను వదిలేసినా ఒకే శిక్ష పడేలా చట్టం ఉండాలి’ అని సూచించారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే: ఒవైసీ
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘ముస్లిం మహిళలపై ఇంత ప్రేమ చూపుతున్న బీజేపీ శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలు వెళ్లడాన్ని వ్యతిరేకించింది. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. ఎందుకంటే ఓ ముస్లిం పురుషుడు చేసిన నేరానికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని బిల్లులో పొందుపర్చారు. ఇదే తప్పును ముస్లిం కానివారు చేస్తే ఏడాది జైలుశిక్ష మాత్రమే పడుతుంది’ అని విమర్శించారు. ఆర్‌ఎస్పీకి చెందిన ఎంపీ ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్‌తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును 2018, సెప్టెంబర్‌లో ఓసారి, 2019, ఫిబ్రవరిలో మరోసారి కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది.
లోక్‌సభలో ‘ట్రిపుల్ తలాక్’ రగడ
Published Sat, Jun 22 2019 4:43 AM | Last Updated on Sat, Jun 22 2019 5:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment