
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం వివిధ జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నిర్ణయం లింగ సమానత్వానికి దోహదం చేస్తుందన్నారు. ముస్లిం మహిళల సాధికారత కోసం తాము ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే.. కాంగ్రెస్ కుంటిసాకులతో రాజ్యసభలో అడ్డుకొని తన నైజాన్ని బయటపెట్టుకుందన్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటి పక్షులని, వారికి ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టేనని విమర్శించారు. మహిళా సమస్యలపై ఈ నెల 27న సదస్సు నిర్వహిస్తున్నామని, దీనికి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హాజరవుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేత వినయ్‌కుమార్ రెడ్డి, డోర్నకల్ మాజీ జెడ్పీటీసీ దేవికా శంకర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ జ్యోతి, జుక్కల్ నియోజకవర్గ టీడీపీ నేత శ్రీనివాస్, వర్ధన్నపేట టీఆర్‌ఎస్ నేత గాడిపెల్లి రాజేశ్వరరావు, రిటైర్డ్ ఎస్‌ఈ సారంగరావుతోపాటు మరో వెయ్యిమంది ఉన్నారు.
3 నుంచి అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ: వచ్చే నెల 3 నుంచి 5 వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని లక్ష్మణ్ అన్నారు. జిల్లా, శాసనసభ స్థాయిలో దీనిపై చర్చించి కేంద్ర పార్టీ నివేదికను పంపిస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment