మీడియాతో మాట్లాడుతున్న కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన మాజీ మంత్రి కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి కుంగుబాటులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అహంకారం కారణంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారే తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదన్నారు. ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమె త్తారు.
రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆదివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి, అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకుల గొంతులు మూగబోయాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న అధికారుల తోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ పార్టీలు రెండూ తోడుదొంగల వంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని లక్ష్మణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment