Triple Thalak
-
ముస్లింలకు అండగా వైఎస్సార్సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముస్లింల ప్రయోజనాలను కాపాడుతుందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. జిల్లా పరిషత్ సమీపంలోని అంకోసాలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా వైఎస్సార్సీపీని బలపరిచి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. పార్టీ తరఫున ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీని ముస్లింలకు కేటాయిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించాం ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మన వైఖరి ఏంటని సార్ అని అధినేత జగన్మోహన్రెడ్డిని సంప్రదించగా ముస్లిం ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారని వెల్లడించారు. ముస్లింలంతా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని.. మనం కూడా వారి ప్రయోజనాలను కాపాడాలంటే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించి ముస్లింలపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలపాలని కొన్ని రాజకీయపార్టీల ఒత్తిడి ఉన్నప్పటికీ వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడాలని జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడేది వైఎస్సార్సీపీ మాత్రమే అని చెప్పారు. విశాఖవాసిగా మీ అందరితో కలసి మెలసి ఉండాలనే ఆకాంక్ష ఉందని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ముస్లింల కోసం చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగాయన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ►మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ నేతలు ముస్లింలను వేధింపులకు గురిచేసినా వైఎస్సార్సీపీ వెంటే నడిచారని కొనియాడారు. ఇదే తరహాలో రాబోయే జీవిఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. ►ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఎంపీగా తాను గెలవడానికి ముస్లింలే కారణమన్నారు. రైల్వే డివిజన్ కోసం పోరాడాలని వైఎస్సార్సీపీ ఎంపీలందరికీ చెప్పి ప్రోత్సహించి, విశాఖ జోన్లో వాల్తేరు డివిజన్ ఉండాలని పార్లమెంట్లో పోరాడుతున్నది విజయసాయిరెడ్డి అని అన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ వచ్చే జీవీంఎసీ ఎన్నికల్లో అన్ని వార్డులు గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతినిద్దామ న్నారు. ►వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన శైలిలో ప్రజాపాలన సాగిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరుఖీ మాట్లాడుతూ ముస్లింలో పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే ఇళ్లు మంజూరు చేయబోమని బెదిరించినా వైఎస్సార్సీపీనే గెలిపించామన్నారు. ►కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్త కె.కె రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్లమెంట్, నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు బర్కత్ అలీ, షరీఫ్, మైనారిటీ విభాగం ముఖ్య నాయకులు షబీరా, షేక్ బాబ్జి, అప్రూజ్ లతీఫ్, కేవీ బాబా, షేక్ మున్ని, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సత్తి రామకృష్ణారెడ్డి, రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, బెహరా భాస్కరరావు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ తలాక్ చరిత్రాత్మకం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం వివిధ జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నిర్ణయం లింగ సమానత్వానికి దోహదం చేస్తుందన్నారు. ముస్లిం మహిళల సాధికారత కోసం తాము ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే.. కాంగ్రెస్ కుంటిసాకులతో రాజ్యసభలో అడ్డుకొని తన నైజాన్ని బయటపెట్టుకుందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటి పక్షులని, వారికి ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టేనని విమర్శించారు. మహిళా సమస్యలపై ఈ నెల 27న సదస్సు నిర్వహిస్తున్నామని, దీనికి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హాజరవుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత వినయ్‌కుమార్ రెడ్డి, డోర్నకల్ మాజీ జెడ్పీటీసీ దేవికా శంకర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ జ్యోతి, జుక్కల్ నియోజకవర్గ టీడీపీ నేత శ్రీనివాస్, వర్ధన్నపేట టీఆర్ఎస్ నేత గాడిపెల్లి రాజేశ్వరరావు, రిటైర్డ్ ఎస్ఈ సారంగరావుతోపాటు మరో వెయ్యిమంది ఉన్నారు. 3 నుంచి అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ: వచ్చే నెల 3 నుంచి 5 వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని లక్ష్మణ్ అన్నారు. జిల్లా, శాసనసభ స్థాయిలో దీనిపై చర్చించి కేంద్ర పార్టీ నివేదికను పంపిస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
తలాక్’ నిందితులకు బెయిల్
న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్‌కు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేయడంతో పాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇదివరకే లోక్‌సభలో గట్టెక్కగా, రాజ్యభలో పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజైన శుక్రవారమే సవరించిన బిల్లును కేంద్రం మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టే వీలుంది. భార్య వాదనలు విన్న తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా నిబంధన చేర్చామని, అయినా ట్రిపుల్ తలాక్..బెయిల్‌కు అర్హంకాని నేరంగానే కొనసాగుతుందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. బిల్లులో కీలక సవరణలు.. ► పోలీస్ స్టేషన్లోనే నిందితుడికి బెయిల్ లభించదు(అంటే ట్రిపుల్ తలాక్ నేరం నాన్–బెయిలబుల్‌గా ఉంటుంది) ► భార్యకు పరిహారం ఇచ్చేందుకు భర్త అంగీకరించాకే మేజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. పరిహారం ఎంతనేది మేజిస్ట్రేట్ ఇష్టం. ► బాధితురాలు లేదా ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు. ► కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛను ఇరు పక్షాల(భార్య, భర్త)కు కల్పించారు. మేజిస్ట్రేట్ తన అధికారాలతో భార్యాభర్తల మధ్య సయోధ్యకు ప్రయత్నించొచ్చు. ► మైనారిటీ తీరని పిల్లల సంరక్షణను తనకు అప్పగించాలని భార్య చేసుకున్న విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ పరిశీలిస్తారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సుమారు 35 లక్షల టన్నుల పప్పుదినుసులను రాయితీపై రాష్ట్రాలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్ ధర కన్నా కిలోకు రూ.15 తక్కువకే రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు కేంద్రం విక్రయించనుంది. ► ఓబీసీ కులాల ఉపవర్గీకరణకు జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పదవీకాలం నవంబర్ వరకు పొడిగింపు. ► తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. మంత్రి మండలి సభ్యులు మౌనంవహించి నివాళులు అర్పించారు. -
ట్రిపుల్ తలాక్ బాధితురాలిపై కఠిన ఫత్వా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇస్లాం సంప్రదాయాలను సవాలుచేసిన ట్రిపుల్ తలాక్ బాధితురాలు నిదాఖాన్‌పై మత గురువు ఒకరు కఠిన ఆంక్షలు విధిస్తూ ఫత్వా జారీచేశారు. ఆమె జబ్బుపడినా మందులు ఇవ్వొద్దని, ఆమె మరణించిన తరువాత ప్రార్థనలు చేయొద్దని, పూడ్చడానికి స్థలం కేటాయించొద్దని అందులో పేర్కొన్నారు. ఆమెకు సాయం చేసేవారు, మద్దతుగా నిలిచే వారికి కూడా ఇదే శిక్ష అమలవుతుందని తెలిపారు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నిదాఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. పురుషహంకార సమాజానికి ఎదురుతిరిగినందుకే తనను బహిష్కరించారని, ట్రిపుల్ తలాక్ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం తీసుకురావాలని నిదాఖాన్ అన్నారు. నిఖా హలాలా బాధితురాలు సబీనాకు నిదా అండగా నిలిచింది. బరేలీలో నివసించే సబీనాకు తొలుత ఆమె భర్త తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులిచ్చాడు. అనంతరం మళ్లీ ఆయనను పెళ్లి చేసుకోవాలంటే.. నిఖా హలాలా ద్వారా మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆమెకు నిఖా హలాలా విధానంలో భాగంగా సొంత మామ(భర్త తండ్రి)తోనే మళ్లీ పెళ్లి చేశారు. విడాకుల అనంతరం మళ్లీ మొదటి భర్తతో సబీనాకు వివాహం జరిపించారు. ఇక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. మళ్లీ సబీనాకు ఆమె భర్త విడాకులిచ్చాడు. ఈసారి సొంత మరిదిని మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం ప్రారంభించారు. ఇక భరించలేక ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న నిదాను సబీనా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నిదాపై ఫత్వా జారీ అయింది. -
‘ముస్లిం మహిళలకు సామాజిక న్యాయం’
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని..సామాజికన్యాయం, సమానత్వంకోసం ముస్లిం మహిళలు చేస్తున్న పోరాటాలు ఈ బిల్లుతో ముగిశాయని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎంఐఎం అధినేత ఒవైసీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..అందరికీ సమన్యాయం కోసమే చట్టాలు కఠినతరం చేశామన్నారు. రాజకీయపార్టీలన్నీ ముస్లింలను ఓటుబ్యాంకుగానే చూశాయని..అదే పొరపాటును కొనసాగించకూడదనే కాంగ్రెస్ కూడా ట్రిపుల్ తలాక్ చట్టానికి మద్దతు ఇచ్చిందన్నారు. 2018 బీజేపీకి ఉద్యమాల సంవత్సరమని, పోరాటాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, భూసేకరణ వంటివాటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌ను ఆరునెలల పాటు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముస్లిం మహిళలకు పెద్ద ఊరట కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తలాక్‌పై తీర్పు నేపథ్యంలో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముస్లిం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ అమలులో లేదన్నారు. భారతదేశంలో తలాక్‌ను నిషేధించడాన్ని మతపరంగా చూడొద్దని, ఒక సామాజిక రుగ్మతగానే చూడాలని కోరారు. -
‘తలాక్’ తీర్పును స్వాగతిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళలకు పెద్ద ఊరటని, ఈ తీర్పు ను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, సుప్రీం తీర్పు ఎవరి విజ యమో, ఎవరి అపజయమో కాదన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం, స్వావలం బనకు ఈ తీర్పు దోహదం చేస్తుందన్నారు. అనేక ఏళ్ల నుండి దీనికోసం పోరాటం జరుగుతున్నదన్నారు. ఇప్పటికైనా ముస్లిం మత సంస్థలు, పార్టీలు పేద ముస్లిం మహిళలకు అండగా నిలబడాలన్నారు. టాస్క్ఫోర్సు కార్యాలయం మానవ బాంబు దాడి విషయంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాటలు బాధ్యతారాహిత్యమన్నారు. టాస్క్ఫోర్సు కేసులో ఒకలాగా, మాలెగావ్ దాడుల మీద మరోలాగా మాట్లాడటం ఒవైసీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. -
తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు
ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే మార్పు ► ఇస్లాంలోని మేధావులు ఈ దిశగా ప్రయత్నించాలి ► బసవ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పిలుపు ► 700ఏళ్ల క్రితమే సామాజిక దురాచారాలపై బసవన్న పోరాడారని ప్రశంస న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం మానేయాలని ముస్లింలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే ట్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడొచ్చని అభిప్రాయపడ్డారు. కన్నడ తత్వవేత్త బసవేశ్వర జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ట్రిపుల్ తలాక్ కూడా అలాంటిదే. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మిమ్మల్ని (ముస్లింలను) కోరుతున్నాను. దీనికో పరిష్కారం కోసం ఆలోచించండి. తరతరాలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా ఈ పరిష్కారం చాలా గొప్పగా ఉండాలి’ అని కోరారు. సమాజంలో కాలదోషం పట్టిన విధానాలను నిర్మూలించి సరికొత్త నూతన వ్యవస్థను నెలకొల్పటం ద్వారానే ప్రభావవంతమైన వ్యక్తులు పుట్టుకొస్తారని ప్రధాని అన్నారు. భారతీయ ముస్లింలు కేవలం మన దేశానికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధునిక మార్గాన్ని చూపించేందుకు ముందుండి నడవాలన్నారు. ‘ఈ దేశం మనకిచ్చే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు అవే’ అని మోదీ అన్నారు. ఆనాడే సమానత్వంపై.. బసవేశ్వరుడు మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలన వంటి మహోన్నత ఆదర్శాలను పాటించారని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘ముస్లిం సమాజం నుంచి కూడా మేధావులు, గొప్ప వ్యక్తులు బయటకొచ్చి ట్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడతారని నేను నమ్ముతున్నాను. ముస్లిం సోదరీమణులు, తల్లులకు ఈ కష్టం నుంచి విముక్తి కల్పిస్తారని భావిస్తున్నాను. మార్పు కోరుకునే ముస్లింలే ఈ బాధ్యతను తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. బసవేశ్వరుడు చేసిన 2500 ధార్మిక ప్రవచనాలను ‘వచన్’ పేరుతో ముద్రించిన గ్రంథాన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ వచన్ను 23 భాషల్లో తర్జుమా చేశారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బలమైన లింగాయత్ సామాజిక వర్గం ఐకాన్ అయిన బసవ జయంతి కార్యక్రమానికి మోదీ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సబ్ కా సాథ్, సబ్కా వికాస్’ నినాదం ద్వారా ఎవరిపైనా వివక్ష లేకుండా అందరినీ అభివృద్ధి చేస్తామని మోదీ పునరుద్ఘాటించారు. చరిత్రను విస్మరిస్తున్న యువత: దాదాపు 40 నిమిషాలసేపు ప్రసంగించిన మోదీ.. నేటి యువత భక్తి ఉద్యమం నడిపిన గొప్ప వ్యక్తులను విస్మరిస్తోందన్నారు. ‘మన విద్యావ్యవస్థలోని లోపమో లేక మన వారసత్వాన్ని మరిచిపోయే స్వభావమో తెలియదు కానీ.. బసవన్న వంటి సంఘ సంస్కర్త 700 ఏళ్ల క్రితం చెప్పిన మహిళా సాధికారతకు మద్దతు పలికిన విషయాన్ని నేటి యువత తెలుసుకోలేకపోతోంది’ అని ప్రధాని తెలిపారు. మన దేశం మహా పురుషులు, గొప్ప సంఘ సంస్కర్తలతోనే పరివర్తన చెందిందన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘మహామహులైన విదేశీయులను ఓడించిన దేశంగానే కాదని, సుపరిపాలన, అహింస, సత్యాగ్రహం వంటి గొప్ప సందేశాలను భారత్ ప్రపంచానికి ఇచ్చింది’ అని అన్నారు. 1964లో బసవ సమాజాన్ని స్థాపించిన మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జట్టికి ఈ సందర్భంగా మోదీ నివాళులర్పించారు. హత్యకు గురైన కన్నడ రచయిత, హేతువాది కల్బుర్గి కుటుంబ సభ్యులను కలిశారు. మీరే రాజకీయం చేస్తున్నారు: విపక్షాలు న్యూఢిల్లీ: ప్రధాని ట్రిపుల్ తలాక్‌పై చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ, బీజేపీలే ఎన్నికల్లో లాభం కోసం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై మోదీ మాట్లాడాలని ఎస్పీ నేత ఆజంఖాన్ అన్నారు. గోరక్ష దళాల దాడుల్లో భర్తలను కోల్పోతున్న ముస్లిం మహిళల ఆందోళనను పట్టించుకోవాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడకూడదని జేడీయూ నేత శరద్‌యాదవ్ అన్నారు.