‘తలాక్‌’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ | Cabinet approves Ordinance criminalise triple talaq | Sakshi
Sakshi News home page

‘తలాక్‌’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌

Published Thu, Sep 20 2018 12:56 AM | Last Updated on Thu, Sep 20 2018 8:44 AM

Cabinet approves Ordinance criminalise triple talaq - Sakshi

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్‌

న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్‌ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు.

ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్‌ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్‌ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్‌ సోనియా గాంధీ, తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయంత్రం సంతకం చేశారు.    

సోనియా మౌనం సరికాదు..
‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్‌ అన్నారు. ఓటుబ్యాంక్‌ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్‌ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆనంద్‌ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్‌ మధ్య కాలంలో 430 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.

సాధికారత దిశగా  ముందడుగు: బీజేపీ
మహిళా సాధికారత దిశగా ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్‌ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం
తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను భారత్‌ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్‌లో తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు.

ఆర్డినెన్స్‌లో ఏముందంటే..
► తక్షణ ట్రిపుల్‌ తలాక్‌కే ఇది వర్తిస్తుంది.
తనకు, తన మైనర్‌ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు.
పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం.
బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి.
ట్రిపుల్‌ తలాక్‌ను నాన్‌బెయిలబుల్‌ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్‌ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు.
భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్‌ బెయిల్‌ మంజూరు చేయొచ్చు.
బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇస్తారు.
చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్‌ నిర్ణయిస్తారు.
మెజిస్ట్రేట్‌ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు.
ట్రిపుల్‌ తలాక్‌ కాంపౌండబుల్‌ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది.


మార్పులు ఇలా..
ముమ్మారు తలాక్‌ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్‌ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్‌స్టంట్‌ తలాక్‌) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే..

2015 అక్టోబర్‌ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు.  
2016 జూన్‌ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం
డిసెంబర్‌ 9: ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్‌ హైకోర్టు.  
2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.  
ఏప్రిల్‌ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన.
మే 15: ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.
ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన
ఆగస్టు 22: ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన
డిసెంబర్‌ 28: లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం
2018 సెప్టెంబర్‌ 19: ట్రిపుల్‌ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement