సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు అంశం అధికార టీఆర్‌ఎస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. బోగస్ సభ్యత్వాలు అంటూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. సభ్యత్వ నమోదు గణాంకాలపై ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. రెండేళ్లపాటు అమల్లో ఉండే పార్టీ సభ్యత్వాల సేకరణ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్ 27న ప్రారంభించారు. కోటి మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకోగా సుమారు నెలన్నర వ్యవధిలో 60 లక్షల మందికి టీఆర్‌ఎస్ సభ్యత్వం ఇచ్చారు. ఇందులో 20 లక్షల మంది క్రియాశీల సభ్యులని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ ఖాతాకు రూ. 25 కోట్ల మేర నిధులు సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 31 వరకు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 50 వేల సభ్యత్వాల ద్వారా దేశంలోనే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్ నిలిచిందని కేటీఆర్ ప్రకటించారు.
బోగస్ లెక్కలు మీవే.. కాదు మీవే
రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని బీజేపీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ ఏడాది జూలై 6న ప్రారంభించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ఇరు పార్టీలు ‘బోగస్ సభ్యత్వాలు’అంటూ పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌వి బోగస్ సభ్యత్వాలు అని, పార్టీ నేతలే జాబితాలు తయారు చేశారని బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ ‘మిస్డ్‌కాల్’ద్వారా చేసిన సభ్యత్వాలను కూడా కలుపుకొని పార్టీ సభ్యుల సంఖ్య 13 లక్షలు అని చెప్పుకుంటోందని టీఆర్‌ఎస్ ప్రతివిమర్శలు చేసింది. బీజేపీ తరహాలో మిస్డ్‌కాల్ సభ్యత్వాలు చేయాలనుకుంటే గంట వ్యవధిలో మూడు కోట్లు చేస్తామని ఎద్దేవా చేసింది. సభ్యత్వాల సేకరణ, సంఖ్యను ఇరు పార్టీలు తాము రాష్ట్రంలో బలంగా ఉన్నామనే సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నాయి.
నగరంలో టీఆర్‌ఎస్ విజయోత్సవ సభ...
రాష్ట్రంలో 60 లక్షలకుపైగా సభ్యత్వాలను సేకరించామనే అంశానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా బీజేపీ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం యూసుఫ్‌గూడలోని విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 8 వేల మందికిపైగా పార్టీ కార్యకర్తలు సభకు హాజరవుతారని చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
‘సభ్యత్వ’ సమరం...
Published Tue, Aug 27 2019 3:30 AM | Last Updated on Tue, Aug 27 2019 3:30 AM
Comments
Please login to add a commentAdd a comment