సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముం దని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ శ్రేణులతో ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానమివ్వడంతో పాటు కేడర్‌కు సూచనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఉద్ఘాటిం చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు నాలుగేళ్ల పాటు రైతులను మోసం చేసి ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై నెపాన్ని మోపుతోందని ఆరోపించారు.
వ్యవసాయానికి ఏం చేశారు?
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరికి క్వింటాలుకు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, మిర్చికి రూ.10 వేలు, పసుపుకు రూ.10 వేలు, ఎర్రజొన్నలకు రూ.3 వేలు, కందులకు రూ.7 వేల చొప్పున మద్దతు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఇందులో కేంద్రం ఇచ్చేది పోను మిగిలింది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మార్కెట్‌లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని, పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రభుత్వం నుంచే బీమాసొమ్ము చెల్లిస్తామన్నారు.
‘శక్తి యాప్’పై అశ్రద్ధ వద్దు
శక్తి యాప్‌లో సభ్యులుగా చేరే విషయంలో పార్టీ కార్యకర్తలు అశ్రద్ధ చేయొద్దని ఉత్తమ్ కోరారు. శక్తి యాప్‌లో సభ్యులుగా చేరడం వల్ల పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవచ్చని, అధిష్టానానికి కూడా సమాచారం ఇవ్వొచ్చని చెప్పారు.
రాష్ట్రంలోని 31 రిజర్వుడ్ నియోజకవర్గాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కోఆర్డినేటర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నియోజకవర్గాల్లో బూత్ కమిటీల ఏర్పాటు, శక్తి యాప్ రిజిస్ట్రేషన్లపై ఆరా తీసిన ఉత్తమ్.. త్వరగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో శక్తియాప్ రాష్ట్ర కోఆర్డినేటర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎల్‌డీఎంఆర్‌సీ కోఆర్డినేటర్ వేణుగోపాల్, మదన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment