సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పదవీయోగం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచినా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఈ ఏడాది సీఎం కేసీఆర్ కొన్నింటిని భర్తీ చేసినా.. అవి రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులకే పరిమితమయ్యాయి. చైర్మన్లను నియమించిన కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల భర్తీని కూడా పెండింగ్‌లో పెట్టారు. వేల సంఖ్యలో ఉండే డైరెక్టర్ పదవులు, బోర్డు మెంబర్ల పోస్టుల కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.
జిల్లా నేతల్లో పెరిగిన అసంతృప్తి
నామినేటెడ్ పోస్టుల భర్తీ లేకపోవడంతో ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అసంతృప్తి నెలకొంది. క్షేత్రస్థాయిలో పని చేయించుకోవాల్సింది వారితోనే కావడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. వారిని సముదాయించలేక, పదవులు ఇప్పించుకోలేక, అధినేత వద్ద బలంగా డిమాండ్ చేయలేక ఎంపీలు, ఎమ్మెల్యేలు సతమతమయ్యారు. ఏడాదిన్నరలోపే సార్వత్రిక ఎన్నికలు ఉండడం, తమను నమ్ముకున్న ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కేడర్‌కు పదవులు ఇప్పించుకోలేకపోవడంతో వారితో పని చేయించుకోవడం కష్టంగా మారుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మేజర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు భర్తీ అయ్యాయి. దాదాపు 43 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 4 వేల దాకా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని చెబుతున్నారు. భర్తీ చేసినవి పోను మిగిలిన కొన్ని పోస్టులపై పార్టీ అధినేత స్పష్టత ఇచ్చారని అంటున్నారు. వీటిపై కసరత్తు మొదలు పెట్టారని, జనవరి చివరికల్లా పోస్టులన్నీ భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
కేడర్‌లో జోష్ పెంచేందుకే..
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కేడర్‌లో జోష్ నింపాలన్న వ్యూహంతో పదవుల భర్తీకి జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కీలక నామినేటెడ్ పోస్టులన్నీ పార్టీలో మొదట్నుంచి పనిచేసిన వారికి దక్కాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నేతలు చాలా మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఈసారి భర్తీ చేయనున్న పదవుల్లో వారికి కూడా చోటు దక్కనున్నట్లు సమాచారం. మరోవైపు ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి పదవులు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment