
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయంపైనా వ్యూహాలకు పదును పెట్టారు. తమకు మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ సీట్లను కచ్చితంగా గెల వాలని పార్టీ నేతలను ఆదేశించారు. టీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్య క్షుడు కె.తారకరామారావు సైతం పదవి చేపట్టిన వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పని ప్రారంభిం చారు.
ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్య దర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జు లుగా నియ మించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానా లకు ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉంటారని ప్రకటించారు. ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారికి బాధ్యతలు అప్ప గించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.
విపక్షాల సీట్లపైనా గురి...
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 11 ఎంపీ సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ రెండు స్థానాలను, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఎంఐఎం ఒక్కో సీటును గెలుచుకున్నాయి. అనంతరం కాంగ్రెస్ తరఫున గెలిచిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలిచిన మల్కాజిగిరి ఎంపీ సి.హెచ్. మల్లారెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు మొత్తంగా 13 మంది ఎంపీలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన
ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ లెక్కన టీఆర్‌ఎస్ ప్రస్తుతం సిట్టింగ్ సీట్లను
తిరిగి నిలబెట్టుకోవడంతోపాటు మరో రెండు స్థానాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. సిట్టింగ్ స్థానాలను గెలుచుకొని సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లలో బలం చాటితేనే టీఆర్‌ఎస్ అనుకున్న 16 లోక్‌సభ సీట్ల లక్ష్యం నెరవేరుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్ స్థానాలపై టీఆర్‌ఎస్ పూర్తి భరోసాతో ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పరిస్థితుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ కోసం వ్యూహం రచిస్తోంది.
సిట్టింగ్‌లకు సీట్లు!
టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎంపీల్లో ఇద్దరు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సిన అనివార్యత ఉంది. అలాగే ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన ముగ్గురు ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల పరిస్థితులకు అనుగుణంగా పలు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2, 3 మార్పులు చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ స్థానాల్లో కొత్త వారిని బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో తుమ్మల నాగేశ్వర్‌రావుకు అవకాశం ఇచ్చే విషయాన్ని టీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో మరేదైనా బాధ్యత అప్పగిస్తే ఈ సెగ్మెంట్‌లోనూ మార్పు ఉండనుంది.
మాజీలకు అవకాశం...
- గత లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేకానందకు టీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
- చేవేళ్లలో టీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఈ స్థానంలో గెలుపును టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సీటుపై గట్టి పట్టున్న మాజీ మంత్రి, తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
- నాగర్‌కర్నూల్ స్థానంలో టీఆర్‌ఎస్‌కు గెలుపు దక్కడంలేదు. 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసిన ఆరు లోక్‌సభ స్థానాల్లో ఐదు చోట్ల గెలిచింది. సాంకేతిక కారణాలతో పార్టీ గుర్తు రాకపోవడంతో నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లోనూ నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ మంత్రి పి. రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథంలో ఒకరికి టీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వనుంది.
- సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఈసారి కచ్చితంగా గెలవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ ఆరు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యం నిలుపుకున్నాయి. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని బరిలో నిలిపితే గెలుపు కచ్చితంగా ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తూమ్ భీంసేన్ పోటీ చేశారు. టీఆర్‌ఎస్ నేతలు దండె విఠల్, బొంతు శ్రీదేవి యాదవ్, తలసాని సాయి యాదవ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.
- మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చామకూర మల్లారెడ్డి గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవలే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మల్కాజిగిరి ఎంపీ సీటును ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment