సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారా.. అసలు ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి.. సీఎం స్థానంలో కేసీఆర్ కాకుండా వేరే వారుంటే అతి తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగేదని అనుకుంటున్నారా.. టీఆర్‌ఎస్ పార్టీ, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఎలా ఉంది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు..?.. ఈ ప్రశ్నలేమిటో తెలుసా.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అధికార టీఆర్‌ఎస్ స్వయంగా చేపట్టిన సర్వే ఇది. నవంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో పార్టీ, ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితిని తెలుసు కునేందుకు... కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల పట్ల ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు ఈ సర్వే మొదలుపెట్టినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శరవేగంగా ఈ సర్వే జరుగుతున్నట్లు పేర్కొంటున్నాయి.
మూడు శాతం ఓటర్లు శాంపిల్‌గా..
ఒక్కో నియోజకవర్గంలోని ఓట్లలో 3 శాతం ఓటర్లను శాంపిల్‌గా తీసుకుని సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో జరుగుతున్న చర్చ, ఇది వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎలా ఉపయోగ పడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సంసిద్ధమవడంలో భాగంగా టికెట్ల ఖరారు మార్పులు, చేర్పులకు ఈ సర్వే ఫలితాలను ఉపయోగించుకునే అవకాశముందని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎనిమిది అంశాలతో..
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి బాగా అమలు చేస్తున్నారని భావిస్తున్నారా, ఒకవేళ వేరే పార్టీ సీఎం ఉండుంటే ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు జరిగేవని భావిస్తున్నారా, మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా, తదుపరి సీఎం గా ఎవరిని కోరుకుంటున్నారు, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రస్తుత ఎమ్మెల్యేనే మళ్లీ ఎన్నుకోదలిచారా, ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు, పార్ల మెంటు స్థానానికి ఏ పార్టీకి ఓటేస్తారు.. వంటి ఎనిమిది అంశాలపై ప్రధానంగా ప్రజా భిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం.
గత సర్వేలకు భిన్నంగా..
ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును మదింపు చేసేందుకు, నియోజకవర్గాల్లో లోటుపాట్లను సరిదిద్దేందుకు గతంలోనే మూడు సర్వేలు చేయించారు. రెండు సర్వేల ఫలితాలను ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అందించారు. వారి పనితీరుకు ర్యాంకులు కూడా ఇచ్చారు. అయితే ఈసారి అలా కాకుండా.. మొత్తంగా పార్టీ విషయంలో, వ్యక్తిగతంగా సీఎంపై, ఎమ్మెల్యేలపై జనాభి ప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని... వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని, ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే దానిపై సర్వే చేపడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి సర్వేలు మరికొన్ని జరిగే అవకాశాలున్నా.. ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చేందుకు, ప్రాధమ్యాలను నిర్ణయించుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment