
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటివైపుగా రావడంతో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పైగా ఆ సమయానికి చంద్రబాబు ఇంట్లోనే ఉండటం, తెలంగాణ టీడీపీ కీలక నాయకులతో సమావేశం కావడం, అప్పుడే తలసాని రావడంతో మంత్రిగారి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, ట్రాఫిక్ జామ్ కారణంగా షార్ట్ కట్ తీసుకుందామనే చంద్రబాబు ఇంటిమీదుగా వెళ్లానేగానీ, దీనిపై అనవసర ఊహాగానాలు వద్దంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే..
ఏపీ సీఎం చంద్రబాబుకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్ నంబర్ 65లో సొంత ఇల్లున్న విషయం అందరికీ తెలిసిందే. అదే స్థలంలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. అదే ఇంట్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. కవరేజి కోసం మీడియా కూడా అక్కడికి వెళ్లింది. అంతలోనే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ అటువైపుగా రావడంతో టీడీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. మీడియాను చూసి, కారు ఆపిన తలసాని.. ‘సార్ ఇంట్లోనే ఉన్నారా?’ అని ఆరా తీశారు. తాను అటువైపు ఎందుకు వచ్చానో వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లి మరోసారి ప్రెస్‌మీట్‌పెట్టి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
చంద్రబాబు ఇంట్లో ఉన్నారని తెలియదు : ‘భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. చంద్రబాబు ఇల్లుండే రోడ్ నంబర్ 65 నుంచి రోడ్ నంబర్ 36కు షార్ట్ రూట్‌లో వెళ్లొచ్చు. అందుకే ఆ రూట్‌లో వచ్చా. అసలు చంద్రబాబు హైదరాబాద్‌లోనే, ఆ ఇంట్లోనే ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. తీరా అక్కడ మీడియాను చూశాక, కారు ఆపి మాట్లాడాను. షార్ట్ కట్ కాబట్టే వచ్చానని చెప్పాను. కానీ కొన్ని మీడియా సంస్థలు నేనేదో పొరపాటున వచ్చానని అన్నట్లు చెప్పాయి. ఈ హైదరాబాద్‌ల నాకు తెలియని గల్లీ ఉందా! పొరపాటుకాదు, షార్ట్ రూటని తెలిసే వచ్చాను. దీనిపై లేనిపోని ఊహాగానాలు వద్దు’’ అని తలసాని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment