సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ అంతటి మూర్ఖుడు ఎవరులేరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి కొమ్ముకాసి మంత్రి పదవులు పొందే తత్వం తలసాని శ్రీనివాస్‌దని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం కరీంనగర్ బస్‌స్టేషన్‌ను సందర్శించిన సంజయ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తలసానిని గల్లీల్లో తరిమికొట్టే రోజులస్తాయని అన్నారు.
ఆర్టీసీ విధుల్లో డ్రైవర్లు, కండెక్టర్లు అనారోగ్యం పాలవుతున్నా.. కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారని తెలిపారు. కార్మికులు నెలరోజుల కిందటే సమ్మె నోటీస్ ఇచ్చినా సీఎం కేసీఆర్ వారిని అణగదొక్కాలని చూశారని విమర్శించారు. బీజేపీ నుంచి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేసి మల్టిఫ్లెక్స్‌లను నిర్మించుకునే కుట్రలో భాగంగానే సంస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ఎలా తొలగిస్తారో తాము చూస్తామని సవాలు విసిరారు. యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ కార్మికులంతా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై బీజేపీ రాష్ట్ర కమిటీ త్వరలోనే సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలి : జీవన్‌రెడ్డి
ప్రగతి భవన్‌లో బతుకమ్మ అడితే.. తెలంగాణ మొత్తం బతుకమ్మ పండుగ జరుపుకున్నట్టు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. కార్మికుల సమ్మెకు వెళ్లారంటే.. అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది మరో తెలంగాణ కోసం చేస్తున్న పోరాటమని అభిప్రాయపడ్డారు. తమకు బంగారు తెలంగాణ వద్దని.. బతుకు తెలంగాణ కావాలని వ్యాఖ్యానించారు. మరోవైపు జగిత్యాలలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment