సాక్షి, విజయవాడ: రేవంత్‌రెడ్డి పార్టీని వీడటం.. తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు మెజారిటీ టీటీడీపీ నేతలు సిద్ధపడుతున్నారు. ఈ రాత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం కల్లా మెజారిటీ తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా రాజీనామాలు సమర్పించవచ్చునని వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయనతోపాటు టీడీపీ నేతలు చాలామంది హస్తం గూటికి వెళ్లవచ్చునని వినిపిస్తోంది. ఈ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో టీడీపీ ఖాళీ కాకుండా చూసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈ భేటీ అనంతరం టీ టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై.. దిశానిర్దేశం చేస్తారని అన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారని టీడీపీ నేత పెద్దిరెడ్డి తెలిపారు. ఈ భేటీలో రేవంత్ వ్యవహారంపై చర్చ జరగలేదని, ఆయన రాజీనామా చేయాలని ముందుగానే నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment