రేగా కాంతారావు
సాక్షి, కొత్తగూడెం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్‌ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షణకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరింత పదునుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగినప్పటికీ భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క చోటకూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా విపక్ష ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై అన్ని వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరుగురు పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను గెలుపొందేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాన్ని కూడా చేజిక్కించుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గత నెల 25న ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేలతో ఏజెన్సీ నియోజకవర్గాల సమస్యలపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు భద్రాచలం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ఆత్రం సక్కు హాజరయ్యారు.
పినపాక నియోజకవర్గంలో సాగునీరు, మిషన్ భగీరథలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అంశాలపై సీఎంకు రేగా కాంతారావు క్షుణ్ణంగా వివరించారు. పరిష్కార మార్గాలు సైతం సూచించారు. దీంతో 26న ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను పినపాక నియోజవర్గంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ సూచించగా, ఆమె ఎమ్మెల్యే రేగా సమక్షంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే రేగా టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా శనివారం రేగాతోపాటు మరో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వారిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరేది ఖాయమైపోయినట్లే. నేడు లేదా రేపు టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
మానుకోట ఎంపీ టికెట్‌పై పీసీసీ నాయకత్వాన్ని నిలదీసిన రేగా..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గాలైన మహబూబాబాద్, ఆదిలాబాద్‌లకు సంబంధించి ఒక సీటును లంబాడాలకు, మరో సీటును ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే తాజాగా రెండు టికెట్‌లను లంబాడాలకే ఇవ్వనున్నట్లు తెలియడంతో ఆదివాసీ ఎమ్మెల్యేలు దీనిపై పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆదివాసీ ఎమ్మెల్యేలందరికీ నాయకత్వం వహిస్తున్నది రేగానే కావడం విశేషం.
ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడంపై రేగా ఒకింత గట్టిగానే పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నేరుగా ఆదివాసీ ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల విషయమై సమీక్షలు నిర్వహించడం, రేగాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడటంతో పరిణామాలు మరింత వేగంగా మారిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో ప్రాతినిథ్యం లేని టీఆర్‌ఎస్‌కు రేగా చేరికతో ఆ లోటు పూడనుంది. ఇదే ఒరవడితో జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సంయుక్త ప్రకటన విడుదల చేసిన రేగా, ఆత్రం..
ఇటీవలే తాము కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశామని, ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని పినపాక, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు శనివారం సంయుక్తంగా ప్రకటన చేశారు. పోడు భూముల సమస్య, ఇప్పటికే గిరిజనుల సాగులోఉన్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, వివిధ రకాలుగా జరుగుతున్న అధికారుల వేధింపులు, ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించామని, వీటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment