ముంబై\న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సర్కార్‌పై స్పష్టత వస్తోంది. అధికార పంపకంపై విస్తృతంగా చర్చిస్తున్న ఆయా పార్టీల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివసేన-ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. మరోవైపు రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఖరారు, లౌకిక స్ఫూర్తికి కట్టుబడటం వంటి కీలక అంశాలపై మూడు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పాలనా పగ్గాలు చేపడతారని, డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొరట్‌లు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక ఎన్సీపీ నూతన క్యాబినెట్‌లో మంత్రులపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా నిధులను మహారాష్ట్రలో సమస్యల బారిన పడిన రైతాంగానికి వెచ్చించాలనే అంశంపైనా సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment