Maharashtra ACB
-
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,066గా ఉంది. మూడు రాష్ట్రాల్లో.. కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28వ తేదీ ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అన్ని షాపింగ్‌మాల్స్ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న పండుగల్లో జాగ్రత్త: కేంద్రం కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు. -
‘మహా క్లారిటీ : ఉద్ధవ్‌కే సీఎం పగ్గాలు’
ముంబై\న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సర్కార్‌పై స్పష్టత వస్తోంది. అధికార పంపకంపై విస్తృతంగా చర్చిస్తున్న ఆయా పార్టీల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివసేన-ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. మరోవైపు రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఖరారు, లౌకిక స్ఫూర్తికి కట్టుబడటం వంటి కీలక అంశాలపై మూడు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పాలనా పగ్గాలు చేపడతారని, డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొరట్‌లు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక ఎన్సీపీ నూతన క్యాబినెట్లో మంత్రులపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా నిధులను మహారాష్ట్రలో సమస్యల బారిన పడిన రైతాంగానికి వెచ్చించాలనే అంశంపైనా సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నట్టు తెలిసింది. -
పవార్‌కు మరో పరేషాన్
ముంబై: నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే పాత్రపై దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 12 నీటిపారుదల ప్రాజెక్టుల్లో అజిత్, శరద్ అవినీతికి పాల్పడ్డారని ప్రవీణ్ వటగావ్కర్ అనే సామాజిక కార్యకర్త ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, నీటి పారుదలశాఖ మంత్రి సునీల్ తట్కరేతోపాటు కొంకణ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (కేఐడీసీ)లో పనిచేసే అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ ఫిర్యాదును తాము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన మాట నిజమేనని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే కంపెనీకి మూడు కంటే ఎక్కువ కాంట్రాక్టులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీకి బుధవారం అందజేసిన ఫిర్యాదులో ప్రవీణ్ పేర్కొన్నారు. పవార్, తట్కరే నీటిపారుదలశాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ఈ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. టెండర్ల మంజూరులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల డిమాండ్లను అంగీకరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెఇపారు. నిబంధనలను పాటించకుండానే ప్రాజెక్టులు మంజూరు చేశారని తెలిపారు. మాధవ్ చితాలే కమిటీ కూడా అక్రమాలు జరిగినట్టు ధ్రువీకరించిందని ఏసీబీకి తెలిపారు. ఈ విషయమై తట్కరేను విలేకరుల ప్రశ్నించగా, చితాలే కమిటీ తనకు క్లీన్చిట్ ఇచ్చిందని, తాను అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాల అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టుల వ్యయం పెరుగుదల మొత్తాలను చెల్లించామని సునీల్ తట్కరే ఈ సందర్భంగా వివరణ వచ్చారు.