19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.
కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
డ్రైవర్ తప్పిదం వల్లే..
బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.
బస్సు కండిషన్‌లోనే ఉంది
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్‌లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.
చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..
‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?
బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.
సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి
ముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment