
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరినీ తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సమావేశం అనంతరం ఊమెన్ చాందీ తెలిపారు.
అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యామని వివరించారు. తమ ఆహ్వానంపై కిరణ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, పార్టీని పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్ కాంగ్రెస్ కుటుంబ మనిషి అని, కాంగ్రెస్ పార్టీలో తప్పక తిరిగి చేరతారనే నమ్మకం ఉందని ఊమెన్ చాందీ చెప్పారు. సమయం వచ్చినపుడు ఏపార్టీలో చేరేదీ, అసలు చేరనిదీ అన్ని విషయాలు తానే మీడియాకు చెబుతానని కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment