విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, నలుగురు ఎంపీలను ప్రతిపక్ష పార్టీ నుంచి కొనుగోలు చేసిన చంద్రబాబు కోల్‌కతా వెళ్లి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విజయనగరం రింగ్‌రోడ్ సమీపంలో శనివారం సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ఏపీలో ఎంత మంది పశువులను కొన్నారో ప్రజలకు తెలియంది కాదన్నారు. నాలుగున్నరేళ్లలో 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలతో ఆటలాడుకోవటమే గాకుండా, బరితెగించి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన నాయకుడు చంద్రబాబు తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఓట్ల తొలగింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును దక్కనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా వైఎస్సార్‌సీపీకి చెందిన 22 వేల ఓట్లు తొలగించి, ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లను చేర్పించారన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎటువంటి నిధులు సాధించుకోలేకపోయారని, ఇందుకు వారి స్వార్థం, అవినీతే కారణమని అశోక్‌గజపతిరాజు, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో చేసిన చెత్త పనులకు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో అంటకాగి ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు రావటంతో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నల్లచొక్కాలు వేసుకుని చంద్రబాబు వేషాలు వేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బాబూ.. మీరెన్ని పశువులను కొన్నారు?
Published Sun, Mar 3 2019 4:47 AM | Last Updated on Sun, Mar 3 2019 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment