సాక్షి, విజయవాడ : స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాజకీయవేత్తలను మూడు కేటగిరీలుగా చూడొచ్చని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు.
మొదటి కేటగిరీలో స్వతంత్రం కోసం అన్ని త్యాగాలు చేసి, తర్వాత ఎన్నికల్లో నిలబడి గెలిచిన వారు ఉన్నారని చెప్పారు. వీరికి ప్రజల్లో అపారమైన గౌరవం ఉందని తెలిపారు. రెండోతరం కొంతమేర డబ్బుతో రాజకీయం చేయడం ప్రారంభించారని అన్నారు.
ఇక మూడోతరం పూర్తిగా డబ్బు రాజకీయాలతో పెద్ద ఎత్తున వచ్చిందని అన్నారు. వీరికి మొదటితరం గురించి తెలియదని, వారి ఆదర్శాలు కూడా తెలియవని చెప్పారు. ఈ తరానికి చెందిన వాళ్లు అసలు పుస్తకాలు కూడా చదవరని తెలిపారు. పుస్తక పఠనం తగ్గడం వల్ల మానవ విలువలు తగ్గడం మొదలైందని అన్నారు. పుస్తకాలకు వెలకట్టలేమని చెప్పారు.
డాక్టర్ చదవాల్సిన తాను కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ చదివి ప్రేరణకు గురైనట్లు వెల్లడించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎకనామిక్స్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. పుస్తకాలు, విద్య జీవితాలను మార్చేస్తాయని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ రాసిన పుస్తకాలు తనలో ఆలోచనలు కలిగించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment