
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇదే ఆఖరు ప్రెస్ మీట్..
సాక్షి, తూర్పుగోదావరి : డేటా చోరీ కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియా సమావేశంలో మంగళవారం మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా లభ్యమైందని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్‌గా ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకు డేటా ట్రాన్స్‌ఫర్ చేసినా అది తప్పేనని అన్నారు. అయినా, పోలీసుల ముందుకు రాకుండా అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని విస్మయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇదే ఆఖరు ప్రెస్ మీట్ అని వెల్లడించారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇక మీడియా ముందుకురానని చెప్పారు.
డేటా చోరీపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందించే విధానం ఇదేనా అని టీడీపీని ప్రశ్నించారు. ఎన్నికల స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. టీడీపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి గాని అనవసర కామెంట్లు చేయడం తగదన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా వివరాలు టీడీపీ సేవామిత్రలో ఉన్నాయని అన్నారు. సాధికార మిత్ర పేరుతో సర్వేలు చేసి ఆధార్ నెంబర్ సేకరించి.. ఓటర్ గుర్తింపు కార్డులతో జతచేయడం అక్రమమన్నారు. గడిచిన 40 ఏళ్లలో దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం పెరిగిందని చెప్పారు. రాఫెల్ ధర ఎంతో ఇప్పటివరకు కేంద్రం చెప్పకపోవడం దారుణమన్నారు.