
సాక్షి, రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తప్పుబట్టారు. పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు ఇచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు చెప్పాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంలో అతి పెద్ద కుట్ర దాగుందని ప్రజలు భావిస్తారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని ఆయన అన్నారు. నా మాట తప్పని నిరూపించండి.. చాలెంజ్ చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ సర్కారు ఇచ్చిన నివేదికపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయాన్ని విభజన చట్టం సైతం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. మిగతా ప్రాజెక్టులకు, పోలవరానికి సంబంధం లేదని, అందుకే పోలవరం అథారిటీని కూడా ఏర్పాటుచేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత అథారిటీదేనని ఆయన అన్నారు. అథారిటీకి తెలియకుండా టెండర్లు ఎలా పిలిచారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉండవల్లి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment