హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్‌లో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా వారి సూచనలు సలహాలను ఇచ్చారు. అన్ని విషయాలను క్రోడీకరించి త్వరలోనే పీపుల్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అన్ని ప్రయోజనాలు తీర్చే విధంగా ఉంటుందన్నారు. కేవలం ఉమ్మడి మేనిఫెస్టో ఏర్పాటు గురించి మాత్రమే సమావేశం జరిగిందన్నారు. టిక్కెట్ల సర్దుబాటు గురించి చర్చించలేదన్నారు. దానికి మరొక కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్ మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌కి వ్యతిరేకంగా పనిచేయడం కోసం కూటమిగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆహ్వానించిందన్నారు. మా పార్టీ తరపున కొన్ని సూచనలు సలహాలను ఇచ్చామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అధికారికంగా అమలు చేయాలని సూచించామని చెప్పారు. 34 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి జిల్లా కేంద్రాల్లో కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని కోరామని, ఇంకా అనేక విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉమ్మడి మేనిఫెస్టోకి తుది రూపునివ్వడానికి చర్చిస్తున్నామని, కేసీఆర్ మాదిరి చెప్పినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందకుండా అన్నీ బేరీజు వేసుకుంటున్నామని వివరించారు. బడ్జెట్ ఎంత అవుతుంది అన్న విషయాలను కూడా సరిచేసుకుంటున్నామని, ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించాలని, అదే విధంగా రిటైర్డ్ అధికారులతో కూడా దీనిపై సంప్రదించాలని కాంగ్రెస్‌కి సలహా ఇచ్చామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment