సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం నేడు చర్చోపచర్చలకు తెరలేపింది. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారమే పార్లమెంట్‌లోని లోక్‌సభ ఆమోదించగా, నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత కూడా వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. దీన్ని సవాల్ చేస్తూ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లవచ్చు, న్యాయ ప్రక్రియ ముగిసి అమల్లోకి రావడానికి కొన్ని ఏళ్లే పట్టవచ్చు. అయినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి ఇది ప్రయోజనకరమేనా? అయితే ఎంత మేరకు? అసలు అగ్రవర్ణాల వారు ఎవరు ?
బ్రాహ్మణులు, రెడ్లు, కోమట్లే కాకుండా కులాల నిచ్చెనపై మధ్యలో ఉండే పటేళ్లు, జాట్లు, మరాఠాలు, కాపులు, కమ్మలందరు అగ్రవర్ణాల కిందకే వస్తారు. జనరల్ కేటగిరీ కింద పోటీ ఎక్కువై తమకు రిజర్వేషన్లు కావాలని ఇంతకాలం డిమాండ్ చేస్తూ వస్తున్న వర్గాల ప్రజలు కూడా వీరే. ముఖ్యంగా పటేళ్లు, జాట్లు, మరాఠాలు గత రెండు, మూడేళ్లుగా 20 శాతం రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వీరందరికి కలిపి కేవలం పది శాతం రిజర్వేషన్లంటే అది ఏ మేరకు సరిపోతుందన్నది ప్రధాన ప్రశ్న. ఈ వర్గాల ప్రజల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారు ఎవరు లేని కారణంగా రేపు ఉద్యోగ, విద్యావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినా జనరల్ కేటగిరీకి, ఈ పది శాతం కోటా కేటగిరీకి పోటీలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. అప్పుడు ఈ వర్గాల మధ్య చిచ్చు రేగుతుంది.
మొత్తం జనాభాలో తమ జనాభా నిష్పత్తి ప్రకారం పది నుంచి 30 శాతం వరకు రిజర్వేషన్లు కావాలంటూ పటేళ్లు, జాట్‌లు, మరఠాలు, బ్రాహ్మణులు, రెడ్లు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించవచ్చు. అది సామాజిక అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చు. మరోపక్క ఈ అగ్రవర్ణాల పది శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ,ఎస్టీలు, ఓబీసీలు మరింత సంఘటితం కావచ్చు. అగ్రవర్ణాల పెత్తందారి విధానానికి వ్యతిరేకంగానే ఈ వర్గాల వారు రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరిపారు. ఫలితంగా ఎస్సీ,ఎస్టీలకు 22.5 రిజర్వేషన్లు, మండల కమిషన్ ద్వారా ఓబీసీలకు 27 రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం అంటే వారికి పెత్తనాన్ని తిరిగి అప్పగించడంగానే వారు భావించే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వారు పార్టీకి దూరం అవడం వల్లనే పార్టీ ప్రభుత్వాలు కూలిపోయాయని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలు భావిస్తున్నారు. దూరమవుతున్న ఈ వర్గాలను దగ్గర చేసుకోవడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ పదిశాతం కోటాను తీసుకొచ్చింది. ఓట్ల కోసం రిజర్వేషన్ల నాటకాలు దేశానికి ఇదే కొత్త కాదు. 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జాట్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. దాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన పెద్ద నోట్ల రద్దు లాగా ఈ పది శాతం రిజర్వేషన్లు కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment