సాక్షి, న్యూఢిల్లీ : వరుసగా మూడోరోజు పార్లమెంటు దద్దరిల్లింది. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన, మరోవైపు విగ్రహాల ధ్వంసంపై రగడతో పార్లమెంటు ఉభయసభలు బుధవారం ఉదయం దద్దరిల్లాయి. ఎంపీల ఆందోళన, గందరగోళం నడుమ లోక్‌సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ప్రత్యేక హోదా ఆందోళనలు మూడురోజు కొనసాగాయి. తెలుగు ఎంపీలు బుధవారం కూడా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపారు. విగ్రహాలపై దాడి అంశాన్ని ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. కావేరి నదీ జలాల అంశం కూడా దీనికి తోడయింది. దీంతో సభ్యుల ఆందోళన నడుమ కాసేపు కొనసాగిన రాజ్యసభ.. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది.
అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పటికీ.. మళ్లీ సభ్యులు తమ ఆందోళనను యథాతథంగా కొనసాగించారు. సభ్యుల ఆందోళన, గందరగోళం నడుమ ఎంతోసేపు సభ నడిపించలేకపోయిన స్పీకర్ సుమిత్రా మహాజన్ చివరకు గురువారానికి సభను వాయిదా వేశారు.
గత సోమవారం పునఃప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గత మూడురోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ, ఇతర తెలుగు ఎంపీల ఆందోళన, మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇతర ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో గత మూడు రోజులుగా పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సభను సజావుగా నడిపించేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment