ఏపీ ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు.. | Private Bill In Parliament On Special Status to AP By YSRCP MP | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్పీపీ ఎంపీ..

Published Fri, Aug 4 2023 3:43 PM | Last Updated on Fri, Aug 4 2023 4:14 PM

Private Bill In Parliament On Special Status to AP By YSRCP MP  - Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోకసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వాలని బిల్లులో డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంలో ప్రస్తావిస్తామని చెప్పారు. ఏపీ విభజన చట్ట సవరణ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని పేర్కొన్నారు.

హక్కుల కోసం..గళమెత్తుతాం.. 
 పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తుతామని ఎంపీ భరత్ చెప్పారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌–2023ను ప్రైవేటు మెంబర్‌ బిల్లుగా ప్రవేశ పెట్టామని తెలిపారు. 'విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో మేము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాం.' అని ఎంపీ భరత్ చెప్పారు. 

'కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. విభజన హామీలపై.. గత ప్రభుత్వంలో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకుని ఏపీని వెనక్కు తోశారు. ఆ తప్పిదాలను సవరించుకుంటూ ఏపీకి రావాల్సినవన్నిటినీ  రాబడుతున్నాం. ఈ ప్రైవేటు మెంబర్‌ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెడుతున్నాం. పోలవరం నిధులకు సంబంధించి..  ప్రాజెక్టు ఆథారిటీ సవరించిన అంచనాలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ అంచనాలను ఆమోదించాలనే డిమాండ్‌ ఈ బిల్లులో  ఉండబోతోంది. విభజన చట్టం ప్రకారం గతంలో రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు..  జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులిచ్చారు. ప్రస్తుతం తలసరి ఆదాయం ప్రకారం ఆయా జిల్లాలకు స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేయబోతున్నాం. దీనివల్ల ఒక్కో జిల్లాకు రూ.1000 కోట్లు రావడానికి అవకాశం ఉంది. వాల్తేరు డివిజన్‌ను కలుపుకుని సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ను ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేయనున్నాం. ఈ బిల్లు త్వరలో టేబుల్‌ అవుతుంది.. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చలో దేశాన్ని ఆకర్షించే విధంగా మేం ఏపీ హక్కుల కోసం గళమెత్తుతాం.' అని తెలిపారు. 

'బాధ్యత కేంద్రంపై లేదా..?'
ప్రైవేటు బిల్లులు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందనేది కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ అన్నారు.  2014 ఏపీ విభజన చట్టాన్ని ఎందుకు గౌరవించడం లేదు.. ఆ బాధ్యత కేంద్రంపై లేదా అనేది కూడా ప్రశ్నిస్తామని తెలిపారు.  విభజన చట్టంలోని కీలకమైన మరికొన్ని అంశాలను పక్కన పెట్టడం దురదృష్టకరం, బాధాకరమని చెప్పారు. దుగరాజుపట్నం పోర్టును చట్టంలో పొందుపరిచారు.. సాంకేతిక కారణాలతో దాన్ని రామాయపట్నానికి మార్చారని అన్నారు. ఈ పోర్టుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 
'కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఒక పెట్రో కెమికల్‌ రిఫైనరీ తీసుకురావాలి. దానికి కూడా ఏపీ వయబిలిటీ ఫండ్‌ గ్యాప్‌ పెట్టుకోవాలనడం ఏమిటి..? గుజరాత్, పారాదీప్‌లో ఉన్న రిఫైనరీలకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అడిగారా..? ఏపీ వరకూ వచ్చే సరికి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా మేం ప్రశ్నిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ప్రధాని మోడీ చరిత్రలో నిలిచిపోతారు. విభజన చట్టం ప్రకారం... పదేళ్ల గడువులో ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది...కాబట్టి యుద్ధప్రాతిపదికన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని మేం నిలదీయబోతున్నాం' అని ఆయన చెప్పారు. 
 

టీడీపీది గోడమీది పిల్లివాటం..
నేషనల్‌ క్యాపిటల్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డి దానిపై మాట్లాడారు. 'ఈ బిల్లు ప్రత్యేకమైనది. దేశానికి రాజధానిగా ఉన్న న్యూ ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కాదు. అలా అని కేంద్ర పాలిత ప్రాంతం కాదు. ప్రత్యేకమైన ఇలాంటి ప్రాంతంలో లా అండ్‌ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్‌ పవర్స్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్న ఆలోచనతో మద్దతు ఇచ్చాం. కొన్ని వందల దౌత్య కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతు పలకింది. ఇదే సందర్భంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్టాండ్‌ ఏమిటో కూడా చెప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు.' అని మిథున్ రెడ్డి తెలిపారు.

పోలవరంపై మరో బిల్లు..
వైఎస్ఆర్సీపీ లోక్ సభా పక్ష నాయకుడు మిథున్‌ రెడ్డి పోలవరంపై మరొక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌ కూడా పెట్టారు. అది ఇవాళ టేబుల్‌ అవుతోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లు ఆమోదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును పెట్టారు. పార్లమెంటు వేదికగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ మేం వినియోగించుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశంతో మేం పార్లమెంటులో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

'మాకు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రాబడుతున్నాం. మొన్ననే రూ.10వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో చంద్రబాబు నిధులు తీసుకురాగలిగాడా..? పోలవరానికి సంబంధించి మరొక రూ.12 వేల కోట్ల నిధులు కూడా త్వరలో విడుదల చేయనున్నారు. ఇవన్నీ సాధించుకుంటూనే కేంద్రానికి ఇష్యూ బేసిస్‌గా మద్దతు ఇస్తున్నాం. బిల్లు దేశానికి మంచి జరిగే విధంగా ఉంటే మేం మద్దతు పలుకుతాం. ఒకవేళ నష్టం జరిగితే మేం మద్దతు పలికేది లేదు' అని మిథున్ రెడ్డి చెప్పారు. 

ఇదీ చదవండి: Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్‌’ కథనం -2

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement