సాక్షి, ఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
కాగా, రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు . ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
అలాగే, ‘కేంద్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్న పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దు. పెట్టుబడిదారుల్లోభయాన్ని తొలగించాలి. అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు. దాని వల్ల దేశానికి జీడీపీకి పెద్దగా ఉపయోగం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment