సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకొచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, మార్కెట్లలో పట్టించుకునేవారే లేరన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా తెలంగాణలోనే జరుగుతున్నా సీఎంకు చీమకుట్టినట్లు లేదని దుయ్యబట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ పీఏసీఎస్ చైర్మన్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. పంట రుణాన్ని 4 దశల్లో మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, దాని వల్ల రైతులపై పడే వడ్డీ భారాన్నీ మాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని, కానీ ఇప్పటివరకు మాఫీ చేయలేదని విమర్శించారు. మాఫీ ఏకకాలంలో చేసుంటే వడ్డీ భారం పడేది కాదని, రైతులకు కొత్త రుణాలొచ్చేవని చెప్పారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరపై ప్రశ్నించిన రైతులను బేడీలేసి జైళ్లలో పెడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. గిరిజన రైతులను దోపిడీ దొంగల్లా అరెస్టు చేసి వారి ఆత్మగౌరవం దెబ్బతీశారన్నారు. వీటిపై పోరాటాలు చేయాలని, రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
దళితులకు అండగా కాంగ్రెస్
దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తుందని ఉత్తమ్, మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామని, సీఎం కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. దళితులకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన హక్కులు దక్కకపోగా అవమానాలు, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ నేత ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
ఉత్తమ్‌ను కలసిన సెర్ప్ ఉద్యోగులు
ఉద్యోగ భద్రత కల్పించాలని దీక్షలు చేస్తున్న తమపై పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్‌కు సెర్ప్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్టు చేసి నగర శివారు అవతల వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను కలిస్తే ప్రయోజనం లేకుండా పోయిందని, సీఎంను కలిసే అవకాశం ఇవ్వడం లేదని వివరించారు. సెర్ప్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జరిగే పోరాటంలో అండగా ఉంటామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు.
రుణమాఫీ అంటూ మోసం
Published Wed, Nov 15 2017 2:14 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment