ఇసుక మాఫియాను అరికట్టండి | uttam kumar reddy on sand mafiya | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాను అరికట్టండి

Published Sat, Jan 6 2018 2:12 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

uttam kumar reddy on sand mafiya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిపోయిన ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని గవర్నర్‌ నరసింహన్‌ను టీపీసీసీ కోరింది. ఇసుక మాఫియా, దౌర్జన్యాలు, కిందిస్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న బెదిరింపులు, భూగర్భ జలాలపై ప్రభావం, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఫిర్యాదు చేసింది.

శుక్రవారం ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ముఖ్య నేతలు డి.కె.అరుణ, సర్వే సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, సంపత్‌కుమార్, దాసోజు శ్రవణ్, దానం నాగేందర్, అంజన్‌కుమార్‌ యాదవ్, జి.వినోద్‌రెడ్డి, నేరెళ్ల శారద తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఇసుక లారీలు, ట్రాక్టర్ల కింద సామాన్యులు చనిపోతున్నా పట్టించుకోకుండా మాఫియా ఆగడాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ వివరించారు.

కామారెడ్డి జిల్లాలో బోయిని సాయిలు అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్‌ కింద చనిపోయాడని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన గవర్నర్‌.. సాయిలు మృతికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని కామారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

రూ. వేల కోట్ల దోపిడీ
ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదని, అంతా మాఫియా చేతుల్లో ఉందని, 20 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు 60 వేలకు పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి పెరిగిన ఆదాయాన్ని చూపిస్తూ సామాన్యులను వేధిస్తున్న ఇసుక మాఫియా.. రూ.వేల కోట్లు కొల్లగొడుతోందని వివరించారు. వర్గీకరణ కోసం దీక్ష చేస్తానంటే అనుమతించకపోవడంతో మంద కృష్ణ తన కార్యాలయంలోనే దీక్షకు సంకల్పించాడని, అయినా పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.


హత్య కేసు నమోదు చేయాలి: ఉత్తమ్‌
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాంలో బోయిని సాయిలు మరణానికి కారణమైన కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేతిలో సామాన్యులు హతమవుతుంటే.. ట్వీటర్లు, అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు అంటూ తిరుగుతున్న మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

అడ్డూఅదుపూ లేకుండా చేస్తున్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, పర్యావరణం దెబ్బతింటుం దన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం శాంతియుతంగా, గాంధేయ మార్గంలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, ఇసుకతో రూ.600 కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్న ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు ఏ రేటుకు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

ఇసుక కాంట్రాక్టర్లు సామాన్యులకు ధరలు పెంచి, ప్రభుత్వానికి తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిని ఇసుక మాఫియా తోడేస్తోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


తలాక్‌పై కేసీఆర్‌ వైఖరేంటి?: షబ్బీర్‌
ట్రిపుల్‌ తలాక్‌పై సీఎం కేసీఆర్‌ తన వైఖరి చెప్పాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. త్రిపుల్‌ తలాక్‌ బిల్లులో లోపాలున్నాయని, ఎన్డీయే భాగస్వా మ్య పక్షాలు కూడా అభ్యంతరాలు చెబుతున్నాయని తెలిపారు. ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రం వాకౌట్‌ చేసిందని, ఈ బిల్లుకు సవరణ చేయా లో వద్దో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉం టుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ చెప్పారని, టీఆర్‌ఎస్‌ వైఖరి చూసిన తర్వాత కూడా పొత్తు ఉంటుందా లేదా చెప్పాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement