ధనిక రాష్ట్రంలో ‘ఫీజు’ డబ్బుల్లేవ్‌ | uttam kumar reddy at Student congress | Sakshi
Sakshi News home page

ధనిక రాష్ట్రంలో ‘ఫీజు’ డబ్బుల్లేవ్‌

Published Sun, Feb 4 2018 2:40 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

uttam kumar reddy at Student congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘తెలంగాణ ధనిక రాష్ట్రం. మన రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రానికీ మిగులు బడ్జెట్‌ లేదు. కానీ విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించడానికి మాత్రం ఆంక్షలున్నాయి. ఇదీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన తీరు’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే దొరల పాలనతో సామాజిక న్యాయం కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీసీ విద్యార్థి మహాసభకు ఉత్తమ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేసీఆర్‌ సర్కారుకు అతిత్వరలో ముగింపు పలకాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెడతామన్న సీఎం కేసీఆర్‌... ప్రస్తుతం ఆ ఊసే ఎత్తట్లేదన్నారు. నాలుగేళ్ల పాలనలో గురుకులాలు ప్రారంభించి 30 వేల మందికే ప్రవేశాలు కల్పించారన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తీవ్ర నిర్లక్ష్యం...
‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 90 శాతం మంది పేదలే. వారికి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పావు వంతు మించి లేరు. మరో పావు వంతు మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గతేడాది రూ. 1,600 కోట్ల బకాయిలతోపాటు ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,200 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

ఇటీవల కాంట్రాక్టర్లకు 20వేల కోట్లు బిల్లులు చెల్లించిన ప్రభుత్వం ‘ఫీజు’పథకానికి మాత్రం రూ. 3,800 కోట్లు బకాయి పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టి ఫికెట్లు ఇవ్వలేక ఇబ్బందులు పెడుతున్నాయి’’అని ఉత్తమ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సంఘం ఉద్యమాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, కేవలం ఆ కుటుంబ సభ్యులు మినహా మరెవరికీ లబ్ధి జరగలేదన్నారు. విద్యారంగాన్ని పట్టించుకోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అదే స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: కోదండరామ్‌
వెనుకబడిన కులాల అభివృద్ధికి రిజర్వేషన్లు కీలకమని, అందువల్ల బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం పేర్కొన్న డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని, వాటిని అమలు చేయాల్సిందేనన్నారు.‘ఫీజు’బకాయిలు, ఉపకార వేతనాలను ప్రభుత్వం సకాలంలో విడుదల చేస్తే విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు ఇబ్బందులుండవని, ఈ పథకాన్ని ప్రాధాన్యతగా గుర్తించి అమలు చేయాలన్నారు.


బీసీలకు తీవ్ర అన్యాయం: ఆర్‌. కృష్ణయ్య
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే, విద్యార్థి మహాసభకు అధ్యక్షత వహించిన ఆర్‌. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసాన్ని నివారించాలంటే రిజర్వేషన్ల పెంపే ఏకైక మార్గమన్నారు. ‘‘ప్రస్తుతం 28 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కనీసం 50 శాతానికి పెంచాలి. స్థానిక సంస్థల్లోనూ బీసీ రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి. బీసీల డిమాండ్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చా.

ప్రధాని మోదీతోపాటు సంబంధిత మంత్రులకు కూడా బీసీ రిజర్వేషన్ల పెంపుపై సూచనలు చేశాం. వాటిని అమలు చేయాలి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఉన్నప్పుడే కమిషన్‌ తీసుకునే నిర్ణయాలకు బలం ఉంటుంది. బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులందరికీ ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి’’అని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.


23 అంశాలతో తీర్మానాలు
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కనీసం 50 శాతానికి పెంచాలి
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో సగం సీట్లు ఇవ్వాలి
ర్యాంకుతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలి
♦  ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ కోర్సులకు రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని పెంచాలి
పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
♦  ప్రభుత్వరంగంతో సమానంగా ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జడ్జీలు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల నియామకాల్లోనూ రిజర్వేషన్‌ పద్ధతి పాటించాలి
♦  కేంద్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి
♦  బీసీల కోసం రూ. 60 వేల కోట్లతో కేంద్రం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి నిర్వహణ కోసం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
యూపీఎస్సీలో రిజర్వేషన్ల అమలు గందరగోళంగా ఉన్నందున పారదర్శకత కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి
 విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి గృహాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు 900 గురుకులాలను విడతల వారీగా ప్రారంభించాలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement