అశాంతి నిలయంగా తెలంగాణ.. | Uttam Says Telangana Made Great Strides By Increasing Liquor Income | Sakshi
Sakshi News home page

లిక్కర్ ఆదాయంలోనే తెలంగాణ ప్రగతి: ఉత్తమ్‌

Published Fri, Dec 13 2019 6:37 PM | Last Updated on Fri, Dec 13 2019 7:38 PM

Uttam Says Telangana Made Great Strides By Increasing Liquor Income - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని కేవలం లిక్కర్ ఆదాయం పెంచుకోవడంలో మాత్రమే ప్రగతి సాధించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మద్యం వల్లనే తెలంగాణలో నేరాలు పెరిగాయని.. మద్యాన్ని నియంత్రించాలని అన్నారు. లిక్కర్ ఆదాయాన్ని 22 వేల కోట్ల రూపాయలకు పెంచుకోవడంలో మాత్రమే రాష్ట్రం ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు.

హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే కేసీఆర్‌ ఏడాది పాలన గడిచిందన్నారు. దిశ, విజయ  రెడ్డి, హజీపూర్, వరంగల్, అసిఫాబాద్, జడ్చర్ల హత్యలు దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తీశాయని అన్నారు. హింస, శాంతి భద్రతల విఘాతంలో 2వ స్థానం, అవినీతిలో రాష్ట్రం అయిదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇక ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు.

ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనత వల్లే ప్రమాదాలు, ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు జరిగి 30మంది వరకు మరణించారని కేసీఆర్‌ పాలనపై నిప్పులు చెరిగారు. కేవలం ప్రభుత్వ తప్పిదాల వల్లే 26మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరుతో గందరగోళం నెలకొనడంతో 11 లక్షల మంది రైతులకు ఇంకా పాసు పుస్తకాలు అందలేదని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎమ్యెల్యేలు, మంత్రులను అడిగే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. ఎమ్యెల్యేలకు నియోజకవర్గ  నిధులు ఇచ్చే ప్రణాళిక ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ అసమర్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రం దివాళా తీస్తే.. ఇప్పుడు కొత్తగా ఆర్థిక క్రమశిక్షణ కావాలని కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలనుకున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు గుర్తుకు రావట్లేదని చురకలంటించారు. 17 వేల కోట్ల అదనపు ఆదాయంతో తెలంగాణ ప్రజలు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో.. ఆయన మాత్రం వారి చేతిలో చిప్ప పెట్టారని హేళన చేశారు. రూ. 3 లక్ష కోట్లు అప్పులు చేసినా.. ఏ ఒక్క ఉత్పాదక రంగాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. కేవలం కమీషన్లు దండుకోవడానికే కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

విద్యారంగంపై కేవలం 6 శాతం ఖర్చు చేసూ.. దేశంలోనే విద్యా రంగానికి అతి తక్కువ ఖర్చుపెడుతున్న రాష్ట్రంగా ఉందన్నారు. 12 వేల ప్రభుత్వ బడులను మూసివేస్తామంటే.. పేదలకు చదువు ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం విద్యలో 13వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలోని పిల్లలకు సన్న బియ్యం, గుడ్లు అందడం లేదంటూ గరమయ్యారు. ఇక వైద్యరంగానికి కేవలం 3.5 శాతం కేటాయించి.. పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్‌మెంట్ పథకాలకు నిధుల కొరత ఉండడం దారుణమన్నారు.

అంతేకాక ఈ సందర్భంగా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ అమలు కాక కొత్త ఉద్యోగాలు రాక 36 లక్షల మంది రైతులకు రుణాలు రాక.. వడ్డీలు పెరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతామని చెప్పిన సంగతి ఏమయిందని గుర్తు చేశారు. రైతుబంధు పథకం కింద సగం మంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదని, ఖరీఫ్ డబ్బులు ఇంకా పూర్తిగా ఇవ్వలేదని ఉత్తమ్‌ కు​మార్‌ రెడ్డి విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement