సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏదో పెనుముప్పు ముంచుకొస్తున్నట్లుగా ఐటీ దాడులంటూ గురువారం రాత్రి నుంచి కొన్ని టీవీ చానెళ్లు బ్రేకింగ్ వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఓ కుట్ర సిద్ధాంతాన్ని సీఎం చంద్రబాబు మనుషులు, ఎల్లో మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే ఉత్తుత్తి ఐటీ దాడులు జరుగుతు న్నాయన్నారు. రాష్ట్ర మంత్రులు, లోకేష్, చంద్రబాబు నివాసాలపై ఐటీ సోదాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా జరుగుతున్న సోదాలను కూడా ఏపీపై దాడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గ్రహాంతర వాసులు, తీవ్రవాదులు దాడులు చేస్తున్నారనే తరహాలో, దేశంలో ఎప్పుడూ ఎవరిపైనా ఐటీ దాడులే జరగనట్లుగా ఎల్లో మీడియా ప్రసారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
ముందే ఎలా తెలిసింది?
చంద్రబాబు ఆదేశాల మేరకు లోకేష్ స్వయంగా ఎల్లో మీడియాతో మాట్లాడి తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ విపరీ తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. ఫలానా మంత్రుల మీద ఐటీ దాడులు జరుగుతాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఐటీ సోదాలు అంటేనే చంద్రబాబు జోలికి వచ్చినట్లు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.
గతంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఐటీ సోదాలు జరిగినపుడు చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు ఏం రాశాయో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఐటీ సోదాలు జరిగే విషయం అధికా రులు హఠాత్తుగా దాడి చేసే వరకూ ఎవరికీ తెలియదని,బ చంద్రబాబు, ఆయన మంత్రులపై ఐటీ దాడులు జరుగు తాయని నాలుగు రోజుల నుంచి చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను ఉంచారని పద్మ పేర్కొన్నారు. ఐటీ శాఖలో ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు సానుభూతి పొందేందుకు కుట్ర సిద్ధాంతం ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారన్నారు.
నియోజకవర్గానికి రూ.20 కోట్లు పంపిణీ!
ఎక్కడా ఐటీ దాడులు జరగకూడదని చంద్రబాబు ఎందుకు అడ్డు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతి నియోజ కవర్గంలో ఎన్నికల ఖర్చుకు ఇప్పటికే రూ.20 కోట్లు పంపించా మని లోకేష్ గతంలో తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడిం చిన నేపథ్యంలో ఆయన మాటల ఆధారంగా ఆ రూ. 20 కోట్లు ఎక్కడున్నాయో ఐటీ అధికారులు వెలికి తీయాలని పద్మ కోరారు.
తనను తాను ‘నిప్పు’ అని పొగుడుకునే చంద్రబాబు ఐటీ దాడులంటే ఎందుకంత భయపడు తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నారని గగ్గోలు పెట్టే బదులు సీబీఐ విచారణకు సిద్ధమని చంద్రబాబు ఎందుకు సవాలు విసరలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారు కాబట్టే చంద్రబాబు, లోకేష్ బయట ఉన్నారని వ్యాఖ్యానించారు. లేదంటే వారు జైల్లో ఉండేవారని చెప్పారు.
సంపన్నుల జాబితాలో భువనేశ్వరి ఎలా చేరారు?
ఐటీ, సీబీఐ నుంచి రాష్ట్రానికి ఎవరు వచ్చినా తనపై కుట్ర జరుగుతోందంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని పద్మ విమర్శించారు. తెలంగాణ, కేంద్రం నుంచి దర్యాప్తునకు పోలీసు కానిస్టేబుల్ వచ్చినా చంద్రబాబు గగ్గోలు పెడుతూ అడ్డు పడుతున్నారన్నారు. చంద్రబాబుకు రెండెకరాల నుంచి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఎలా వచ్చింది? నారా భువనేశ్వరి దేశంలో సంపన్నుల జాబితాలో ఎలా చేరారు? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. చేతికి వాచీ, వేలికి ఉంగరం, మెడలో చైన్ లేవని చంద్రబాబు చెబితే దర్యాప్తు సంస్థలు నమ్మి ఊరుకోవాలా? ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment