
సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ కళ్యాణ్.. కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో కర్నూలులో హైకోర్టు ఉండాలని ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. శనివారం ఆయన విజయవాడ 44వ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి 60 లక్షల వ్యయంతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. బాబుతో లాలూచీ పడి బీజేపీలో చేరాడని, ఈయన బాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు దగ్గర పవన్ గుమస్తాగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోట ఒకే మాట వస్తుంది.. మీ పాట్నర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని పవన్‌ను ప్రశ్నించారు.
దుర్మార్గంగా దోచుకున్నారు
‘ఐదేళ్లలో బాబు దుర్మార్గంగా దోచుకున్నందునే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వలేదు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. బాబు.. మా వర్గానికే, మా వాళ్లకే అభివృద్ధి ఫలాలు అందాలనేలా పాలన సాగించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందాలని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చారు. దీనిద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరవేస్తాం. గతంలో పెన్షన్లు 44 లక్షలు ఉంటే ఇప్పుడా సంఖ్య 54లక్షలకు చేరుకున్నాయి’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment